లక్నో: రిటైర్డ్ నేవీ అధికారికి చెందిన రెండు పెంపుడు కుక్కలు తప్పిపోయాయి. (dogs missing) దీంతో సెక్యూరిటీ గార్డులతోపాటు సెక్యూరిటీ ఏజెన్సీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీలో ఈ సంఘటన జరిగింది. సఫేదాబాద్లోని షాలిమార్ ప్యారడైజ్ రెసిడెన్షియల్ కాలనీలో రిటైర్డ్ నావికాదళ అధికారి అజయ్ కుమార్ పాండే నివసిస్తున్నారు. ఆయనకు లైలా, సింబా అనే రెండు పెంపుడు కుక్కలు ఉన్నాయి. లక్నో మున్సిపల్ కార్పొరేషన్లో వాటిని నమోదు చేయించారు.
కాగా, డిసెంబర్ 28న అజయ్ కుమార్ పాండే ముంబై వెళ్లారు. అదే రోజున ఆయన రెండు పెంపుడు కుక్కలు మాయమయ్యాయి. దీంతో ముంబై నుంచి తిరిగి వచ్చిన తన ఇల్లు, కుక్కల భద్రతకు బాధ్యత వహించే సెక్యూరిటీ గార్డులు, ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థపై పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. అక్కడి సీసీటీవీ కెమెరాలను నిలిపివేసి తన పెంపుడు కుక్కలను అపహరించినట్లు ఆరోపించారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ కాలనీలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. అయితే పెంపుడు కుక్కల మాయంపై వారికి ఎలాంటి ఆధారం లభించలేదు.