NEET PG | న్యూఢిల్లీ: నీట్ పీజీ-2024 ఫలితాలు ఆశావహులకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. చాలా మంది అభ్యర్థుల ఫలితాల్లో గణనీయమైన తేడాలు కనిపించడమే ఈ ఆందోళనకు కారణం. అంచనాల కంటే తమ పర్సెంటైల్స్ చాలా అధికంగా ఉన్నాయని, అసలు ఈ రెండింటికీ పొంతనే లేదని కొందరు విద్యార్థులు చెప్తుంటే.. నీట్ పీజీ ర్యాంకుకు సంబంధిత అప్లికేషన్ ఐడీ లేదా రోల్ నంబర్‌కు మధ్య తేడాలు ఉన్నట్టు మరికొందరు చెప్తున్నారు. మరోవైపు షిఫ్ట్-2లో పరీక్షకు హాజరైన పలువురు అభ్యర్థులకు మార్కులు గణనీయంగా తగ్గడం ఈ పరీక్ష పారదర్శకతపై తీవ్రమైన అనుమానాలను రేపుతున్నది. నీట్ పీజీ కటాఫ్‌ను ఎన్బీఈఎంఎస్ ఇంకా విడుదల చేయకపోవడం, ఆన్సర్స్ కీ లేదా జవాబు పత్రాలతోపాటు ఈ పరీక్షకు సంబంధించిన ఎలాంటి కంటెంట్‌ను షేర్ చేయబోమని ఎన్బీఈఎంఎస్ గతంలోనే స్పష్టం చేయడం విద్యార్థుల్లో ఆందోళనను మరింత పెంచుతున్నది. ఈ ఆందోళనకు తెరదించి నీట్ పీజీ ప్రవేశ పరీక్షపై విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు ఎన్బీఈఎంఎస్ పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నదని విద్యార్థులతోపాటు వైద్యులు, నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
యూపీ కానిస్టేబుల్ పరీక్షలో మళ్లీ అక్రమాలు!
లక్నోలో 20 మంది అరెస్టు
లక్నో: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాల తీరు ఓ ప్రహసనంలా మారింది. ఆరు నెలల క్రితం ఏదైతే జరిగిందో.. మళ్లీ అదే రీతిలో పరీక్షల నిర్వహణ ఉందంటూ విమర్శలు వస్తున్నాయి. ఆగస్టు 23, 24 తేదీల్లో నిర్వహించిన పరీక్షల్లో నకిలీ పత్రాలు సహా పలు రకాల మోసపూరిత చర్యలకు పాల్పడ్డారన్న ఆరోపణల కింద 20 మందిని పోలీసులు అరెస్టు చేశారు. బిజ్నోర్‌లోని కేపీఎస్ కన్యా ఇంటర్ కాలేజ్‌లో సీల్ లేని ప్రశ్నా పత్రాలు అభ్యర్థులకు ఇచ్చారన్న ఫిర్యాదులు అందాయి. పేపర్ లీక్ అయ్యిందన్న అనుమానాలు కొంతమంది అభ్యర్థులు వ్యక్తం చేశారు. లక్నోలో లీకైన ప్రశ్నాపత్రంను చూపుతూ ఓ వ్యక్తి సోషల్ మీడియా ‘ఎక్స్’లో వీడియోను విడుదల చేయటం కలకలం రేపింది. దీనికి సంబంధించి ఓ వ్యక్తిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. పరీక్ష నిర్వహణ పారదర్శకంగా లేదన్న ఆరోపణలు రావటంతో యోగి సర్కార్ ఫిబ్రవరిలో పరీక్షను రద్దు చేసింది. ఇప్పుడు మళ్లీ అదే విధంగా పరీక్షను నిర్వహిస్తున్నారంటూ వస్తున్న ఆరోపణల్ని ‘యూపీ పోలీస్ రిక్రూట్మెంట్, ప్రమోషన్ బోర్డ్’ చైర్పర్సన్ రాజీవ్ కృష్ణ కొట్టివేశారు. పేపర్ లీక్ సహా అక్రమాలపై వస్తున్న వార్తలన్నీ వదంతులేనని ప్రభుత్వం ఖండించింది.