బెంగళూరు: కర్ణాటకలో మళ్లీ రిసార్ట్ రాజకీయాలు తెరపైకి వచ్చాయి. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో క్రాస్ ఓటింగ్ నుంచి ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నది. వారిని రిసార్ట్‌కు తరలించేందుకు సన్నద్ధమైంది. (Resort politics) జూన్ 18న కర్ణాటకలోని ఏడు శాసన మండలి (ఎమ్మెల్సీ) స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఐదుగురు అభ్యర్థులైన బీకే హరిప్రసాద్, తిప్పనప్ప కామక్నూర్, పీవీ మోహన్, శివన్న బీఎస్, వినయ్ కార్తీక్ ప్రకాష్‌ను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. గోవిందరాజును జేడీ(ఎస్) నామినేట్ చేయగా లింగరాజ్ పాటిల్, రఘు ఆర్‌ను బీజేపీ బరిలోకి దింపింది. దీంతో ఏడు స్థానాలకుగాను ఎనిమిది మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
కాగా, కర్ణాటక అసెంబ్లీలో ప్రస్తుతం 222 మంది సభ్యులు ఉన్నారు. రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఎమ్మెల్సీగా విజయం సాధించడానికి ప్రతి అభ్యర్థికి 28 ఓట్లు అవసరం. ప్రస్తుత సభ్యుల సంఖ్యా బలం ప్రకారం, కాంగ్రెస్ పార్టీ నాలుగు, బీజేపీ రెండు స్థానాలు కైవసం చేసుకునే అవకాశమున్నది. అయితే ఏడవ స్థానం కోసం కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ కార్తిక్ ప్రకాష్, జేడీ(ఎస్) అభ్యర్థి గోవిందరాజు మధ్య హోరాహోరీ పోరు నెలకొన్నది. దీంతో క్రాస్ ఓటింగ్ కీలక అంశంగా మారనున్నది.
మరోవైపు కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది. క్రాస్ ఓటింగ్‌ను నివారించడం, ప్రత్యర్థి పార్టీల ఫిరాయింపు ఆరోపణలను తిప్పికొట్టేందుకు ఎమ్మెల్యేలను రిసార్ట్‌కు తరలించేందుకు సిద్ధమైంది. జూన్ 16 నుంచి జూన్ 18న పోలింగ్ జరిగే వరకు బెంగళూరుకు 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్ ప్రాంగణంలోని టెర్రియా రిసార్ట్‌లో ఎమ్మెల్యేలను ఉంచనున్నారు. జూన్ 18న వారిని నేరుగా అసెంబ్లీకి తరలించి ఓటు వేయించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.