ముంబై, జనవరి 17: బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలు ముగిసి ఫలితాలు ఇలా వెలువడ్డాయో లేదో.. అలా ఫైవ్‌స్టార్ హోటల్ రాజకీయాలు మొదలయ్యాయి. కూటమిగా పోటీ చేసినా వెన్నుపోటు పొడుస్తారన్న భయం ఏర్పడటంతో దేశంలోనే అతి పెద్ద కార్పొరేషన్‌పై నాయకత్వ ఆధిపత్యం కోసం ప్రయత్నాలు పారంభమయ్యాయి. కొత్తగా ఎన్నికైన తమ పార్టీ కార్పొరేటర్లందరూ బాంద్రాలోని ఫైవ్‌స్టార్ హోటల్‌కు రావాలని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, శివసేన చీఫ్ ఏక్నాథ్ షిండే ఆదేశించారు.
ఇతర పార్టీల వారు తమ కార్పొరేటర్లతో బేరసారాలు జరపకుండా, ప్రలోభాలకు గురి చేయకుండా వారందరినీ తన వద్ద ఉంచుకునేందుకు షిండే ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి మహాయుతి కూటమిగా పోటీ చేశాయి. అయితే కూటమిలో బీజేపీ తర్వాత 29 సీట్లతో శివసేన అతిపెద్ద పార్టీగా నిలిచింది. తమ పార్టీ సహకారం లేకుండా బీఎంసీ మేయర్ స్థానం దక్కించుకునే అవకాశం బీజేపీకి లేకపోవడంతో, బీజేపీ సహా ఇతర పార్టీల వారు ఎలాంటి అవకాశం తీసుకోకుండా ఆయన తన పార్టీ కార్పొరేటర్లందరినీ ఐక్యంగా ఉంచాలని ఫైవ్‌స్టార్ హోటల్‌కు వారిని తరలించారు. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పాగా వేసింది. ముంబైలో మూడు దశాబ్దాల శివసేన ఆధిపత్యానికి గండిపడింది. రాష్ట్రంలోని 29 కార్పొరేషన్లలో 25 చోట్ల బీజేపీ గెలుపొందింది.
ఎన్సీపీకి ఎదురుదెబ్బ
ఈ ఎన్నికల్లో ఎన్సీపీ కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. అజిత్‌పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, శరద్‌పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) తొలిసారి ఈ ఎన్నికల్లో కలిసి పోటీచేశారు. సంప్రదాయంగా తమకు పట్టున్న ప్రాంతంలో కూడా వీరు ఈ ఎన్నికల్లో తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోలేకపోయారు. 24 మున్సిపాల్టీలలో ఎన్సీపీ (ఎస్పీ) కనీసం ఖాతా కూడా తెరవలేక పోయింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైనా స్వల్ప ఊరట లభించింది. రాష్ట్రంలోని నాలుగు మున్సిపాల్టీలలో ఏకైక అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించగా, ఐదు కార్పొరేషన్లలో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. మహారాష్ట్ర అంతటా మజ్లిస్ పార్టీకి 125 స్థానాలు లభించాయి.
జైళ్లో నుంచి గెలిచిన అభ్యర్థులు
ముంబై, జనవరి 17 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఐదుగురు అభ్యర్థులు జైలులోనుంచి గెలుపొందారు. వీరు పుణె, షోలాపూర్, జల్గావ్, జాల్నా మున్సిపాలిటీల్లో పోటీచేశారు. గెలుపొందిన నేరచరితుల్లో గ్యాంగ్స్టర్ల బంధువులు, గౌరీలంకేశ్ హత్య కేసులో నిందితుడు కూడా ఉన్నారు. గ్యాంగ్‌స్టర్ సూర్యకాంత్ అలియాస్ బండు అందేకర్ కోడలు సోనాలి, మరదలు లక్ష్మి పుణె కార్పొరేషన్‌కు ఎన్నికయ్యారు. వీరిద్దరూ తమ మనవడి హత్య కేసులో జైలులో ఉన్నారు. జర్నలిస్ట్ గౌరీలంకేశ్ హత్య కేసులో నిందితుడు శ్రీకాంత్ పంగారర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు.