RBI | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ) : అధికారమే లక్ష్యంగా ఎన్నికల్లో గ్యారెంటీలతో మభ్యపెడుతున్న కాంగ్రెస్ ఉచిత హామీలతో రాష్ర్టాలు దివాలా దిశగా పయనిస్తున్నాయి. ఇదే విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజా నివేదిక ద్వారా తూర్పారబట్టింది. ప్రభుత్వాలు ప్రకటించే ఉచితాలతో రాష్ట్ర ఖజానాలపై పెను భారం పడుతున్నదని ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. తద్వారా సామాజిక, ఆర్థిక మౌలిక వనరులను నష్టపోతున్నట్టు పేర్కొంది. ఈ మేరకు ‘స్టేట్ ఫైనాన్సెస్: ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్స్ ఆఫ్ 2024-25’ పేరిట పలు హెచ్చరికలు జారీ చేసింది.
ఎన్నికల్లో గెలుపు కోసం ముందూ వెనుక ఆలోచించకుండా కాంగ్రెస్ ప్రకటిస్తున్న ఉచిత హామీలపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గత నెలలో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘కర్ణాటకలో మీరు (కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం) ఐదు గ్యారెంటీలను ప్రకటించి అధికారంలోకి వచ్చారు. మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని మహారాష్ట్రలో 5 గ్యారెంటీలను ప్రకటించాం. జార్ఖండ్‌లోనూ దాదాపు ఇదే విధానాన్ని పాటించాం. రాష్ర్టాల బడ్జెట్ ఆధారంగా హామీలు ప్రకటించండి. లేదంటే రాష్ర్టాలు దివాలా తీసే పరిస్థితికి చేరొచ్చు. ప్రణాళికా రహిత విధానం కారణంగా ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే.. భవిష్యత్తు తరాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది’ అంటూ ఖర్గే ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హామీల కారణంగా రాష్ర్టాలకు దివాలా తీసే పరిస్థితి రానీయవద్దని ఆయన నేతలకు సూచించారు. కాగా కాంగ్రెస్ ఉచిత హామీలతో ఆ పార్టీ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ ఇప్పటికే దివాలా అంచుకు చేరుకోగా, కర్ణాటక, తెలంగాణ కూడా పెద్దయెత్తున అప్పుల్లో కూరుకుపోయిన విషయం తెలిసిందే.