ఇడుక్కి (కేరళ), సెప్టెంబర్ 15: సమాజ సంరక్షకులుగా పోలీసులను పరిగణిస్తాం. అలాంటి రక్షకభటులకే రక్షణ కరువైంది. దీంతో వారికి రక్షణకవచంగా నిలిచాయి సరీసృపాలు. పాములు పోలీస్‌స్టేషన్‌కు కాపలాకాయడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా! అయితే ఈ వార్త చదవండి. కేరళ-తమిళనాడు సరిహద్దులో ఇడుక్కి జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతంలో కుంబుమెట్టు పోలీస్‌స్టేషన్ ఉన్నది.
ఈ ఠాణాకు మనుషుల కంటే వివిధ రకాల జంతువుల తాకిడి అధికంగా ఉండేది. ముఖ్యంగా కోతులు గుంపులుగా వచ్చి విధ్వంసం సృష్టించేవి. స్టేషన్ గార్డెన్‌లోని పూలు, పండ్ల మొక్కలను పీకిపారేసేవి. స్టేషన్ పరిసరాల్లో తిరుగుతూ చికాకు తెప్పించేవి. వాటిని అదిలించినా.. మళ్లీ మళ్లీ వచ్చేవి. ఇటీవల రబ్బరు పాములను తీసుకొచ్చి స్టేషన్ పరిసరాల్లో, చెట్లపై, గోడలపై కట్టారు.
వివిధ రకాల చైనా మేడ్ సరీసృపాలు అచ్చం నిజమైన పాములను పోలి ఉండటంతో కోతులతోపాటు ఇతర జంతువులు స్టేషన్ పరిసరాల్లోకి వచ్చేందుకు జంకుతున్నాయి. కోతులు, ఇతర జంతువుల నుంచి రక్షణకు రైతులు ఇలాంటి రబ్బరు పాములు వాడుతున్నారని, వారి సలహాను తాము పాటించామని స్టేషన్ ఎస్సై పీకే లాల్‌భాయ్ తెలిపారు. ఇప్పుడు కోతులు స్టేషన్ వైపు వచ్చేందుకు కూడా భయపడుతున్నాయని పేర్కొన్నారు.