Kejriwal-EC | ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం నోటీసు జారీ చేసింది. ఢిల్లీకి పొరుగున ఉన్న హర్యానా.. యమునా నదిని విషపూరితం చేసిందంటూ పేర్కొన్న బహిరంగ వ్యాఖ్యలకు బుధవారం రాత్రి ఎనిమిది గంటల్లోపు సమాధానం చెప్పాలని ఆదేశించింది. దేశ సమగ్రత, ప్రజా సామరస్యానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన వారికి మూడేండ్ల జైలుశిక్ష విధించాలని కోర్టు తీర్పులు, చట్టాలు చెబుతున్నాయని ఈసీ గుర్తు చేసింది.
యమునా నదిలో రసాయనాలు వేయడం వల్లే భారీ సంఖ్యలో ప్రజలు మరణిస్తున్నారని, మారణ హోమానికి దారి తీస్తుందని ఢిల్లీ జలబోర్డు ఇంజినీర్లు సకాలంలో గుర్తించారని అరవింద్ కేజ్రీవాల్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అధిక రసాయనాల మిశ్రమం యమునానదీ జలాల్లో కలవడంతో ఢిల్లీలో మారణ హోమానికి కారణమవుతుందంటూ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. యమునా నది విషపూరితంతో ఢిల్లీలో మారణ హోం జరుగుతుందని, ఇది నాగసాకి, హిరోషిమా నగరాలపై అణుబాంబుల ప్రయోగంతో సమానం అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. దీనికి ఆధారాలు తెలిపే పత్రాలు సమర్పించాలని ఈసీ డిమాండ్ చేసింది.