ముంబై: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, ‘స్కూల్ ఠీక్ కరో’ ప్రచారంలో భాగంగా మహారాష్ట్ర లాతూర్ జిల్లాలోని ఔసా ప్రాంతంలో ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాలను గురువారం తనిఖీ చేశారు. ఆ సమయంలో ఇతర పాఠశాల విద్యార్థులను ఆ స్కూల్లో కూర్చోబెట్టారని ఆయన ఆరోపించారు. (Abhijeet Dipke) ఆ విద్యార్థుల పేర్లు స్కూల్ రికార్డులలో కూడా నమోదు కాలేదని తెలిపారు. తన రాక గురించి తెలిసిన తర్వాతే మధ్యాహ్న భోజనం కోసం కొత్త ప్లేట్లను తెప్పించారని దిప్కే ఆరోపించారు. ఆ పాఠశాలలో తాగునీటి సౌకర్యం లేదని, తాను రావడానికి కొద్దిసేపటి ముందే మరుగుదొడ్లను శుభ్రం చేసినట్లుగా కనిపిస్తున్నదని అన్నారు. పాఠశాల ఆవరణలో మద్యం సీసాలు కనిపించడంతో అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.
కాగా, ఆ ప్రభుత్వ స్కూల్లోని విద్యార్థులు ‘జంతువుల కంటే అధ్వాన్నమైన’ పరిస్థితుల్లో జీవిస్తున్నారని అభిజీత్ దిప్కే వ్యాఖ్యానించారు. ‘ఒక మంత్రి కుక్కకు కూడా విద్యార్థుల కంటే మెరుగైన సౌకర్యాలు లభిస్తాయి. పదేళ్లుగా కారుతున్న పైకప్పులను బాగు చేయలేకపోయినా లేదా బెంచీల కొరతను తీర్చలేకపోయినా, ప్రభుత్వం అసలు ఏం సాధించినట్లు?’ అని ప్రశ్నించారు. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి దాదా భూసే రాజీనామా చేయాలని దిప్కే డిమాండ్ చేశారు. ఆ ప్రాంతంలోని పాఠశాలల దుస్థితికి బాధ్యులైన, అధికారిక పర్యటనల పేరుతో అందుబాటులో లేని బ్లాక్ విద్యాశాఖ అధికారులను ఎనిమిది రోజుల్లోగా సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
మరోవైపు అభిజీత్ దీప్కే ఆరోపణలను పాఠశాల అధికారులు ఖండించారు. ఒకే భవనంలో మరాఠీ మాధ్యమం, ఉర్దూ మాధ్యమం కోసం రెండు వేర్వేరు పాఠశాలలు నడుస్తున్నాయని పాఠశాల ప్రిన్సిపాల్ బాలాజీ గవాలి తెలిపారు. బయటి విద్యార్థులను తీసుకొచ్చారన్న వాదనను ఆయన తోసిపుచ్చారు. పాఠశాలకు సమకూర్చిన పాత ప్లేట్లలోనే పిల్లలు భోజనం చేసినట్లు చెప్పారు. ఈ ఏర్పాట్లు, ప్రదర్శన అంతా తన సందర్శన కోసమే ప్రత్యేకంగా చేశారన్నట్లుగా దిప్కే పొరపాటుపడుతున్నారని, అయితే వాస్తవం అది కాదని ప్రిన్సిపాల్ అన్నారు.
In Latur’s Ausa Taluka, a govt school had brought in children from outside to present them before the media as its own students.
Why the administration is resorting to fraud instead of actually improving the schools? pic.twitter.com/F7hJJcj3Wp
— Abhijeet Dipke (@abhijeet_dipke) August 20, 2026