Rahul Gandhi | కాంగ్రెస్ అగ్రనేత, మాజీ ఎంపీ రాహుల్ గాంధీకి జార్ఖండ్ హైకోర్టులో ఊరట లభించింది. పరువు నష్టం కేసులో దాఖలైన పిటిషన్ హైకోర్టు విచారణ జరిపింది. రాహుల్‌పై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై హైకోర్టు ఆగస్టు 16న విచారణ చేపట్టనున్నది. 2019లో కర్నాటక కోలార్‌లో జరిగిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ.. ప్రధానిని ఉద్దేశించి.. ‘మోదీ’ ఇంటి పేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పలు రాష్ట్రాల్లో రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా పరువు నష్టం కేసులు నమోదయ్యాయి. జార్ఖండ్‌లో నమోదైన కేసు విచారణ సందర్భంగా రాహుల్‌కు హైకోర్డు మధ్యంతర ఉపశమనం ఇచ్చింది.
జస్టిస్ సంజయ్ కుమార్ ద్వివేది బెంచ్ పిటిషన్‌పై విచారణ జరిపింది. విచారణ సందర్భంగా అన్ని పక్షాల వాదనలు విన్న కోర్టు.. సమాధానం ఇవ్వాలని పిటిషనర్ ప్రదీప్ మోదీని ఆదేశించింది. అదే సమయంలో రాహుల్ గాంధీకి ఊరటనిస్తూ.. తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేసింది. రాంచీలో రాహుల్ గాంధీపై బీజేపీ నేత ప్రదీప్ మోదీ పరువునష్టం కేసు వేశారు. పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు తీర్పు నేపథ్యంలో రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం కోల్పోయిన విషయం తెలిసిందే.