Swami Shraddhanand | రాజీవ్ గాంధీ హంతకులకు మాదిరిగానే తనకు కూడా విముక్తి ప్రసాదించాలని 80 ఏండ్ల స్వామి శ్రద్ధానంద్ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలో చేశారు. భార్యను చంపిన కేసులో 29 సంవత్సరాలుగా జైళ్లో ఉంటున్నారు. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ జేబీ పార్దీవాలా ధర్మాసనం ముందు శ్రద్ధానంద్ తరపు న్యాయవాది వరుణ్ ఠాకూర్ పిటిషన్ వేశారు.
భార్య షకీరాను డబ్బు కోసం శ్రద్ధానంద్ హత్య చేయడంతో ఆయనను జైళ్లో పెట్టారు. 1994 మార్చి నెల నుంచి జైళ్లో ఉంటున్నా కనీసం తనకు ఒక్కసారి కూడా పెరోల్‌పై బయటకు వచ్చే అవకాశం కల్పించలేదని తన పిటిషన్లో సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మైసూర్ మాజీ దివాన్ సర్ మీర్జా ఇస్మాయిల్ మనవరాలు అయిన షకీరా.. మాజీ రాయబారి అక్బర్ ఖలీలీ నుంచి విడాకులు తీసుకున్నారు. ఏడాది తర్వాత 1986 లో ఆమె వివాహం శ్రద్ధానంద్తో జరిగింది. 1991లో బెంగళూరులోని రిచ్మండ్ రోడ్‌లోని ఓ బంగ్లాలో రూ.600 కోట్ల విలువైన సొత్తును లాక్కునేందుకు షకీరాను శ్రద్ధానంద్ సజీవంగా మట్టుపెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. షకీరా మృతదేహాన్ని పోలీసులు బయటకు తీసి.. 1994 ఏప్రిల్ 30 న శ్రద్ధానంద్‌ను అరెస్ట్ చేశారు.
2000 సంవత్సరంలో ట్రయల్ కోర్టు అతడికి మరణశిక్ష విధించగా.. 2005 లో కర్ణాటక హైకోర్టు ఆ శిక్షను బలపరిచింది. తర్వాత 2008 లో శ్రద్ధానంద్ అప్పీల్‌పై సుప్రీంకోర్టు మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చింది. ఇలాఉండగా, రాజీవ్ హంతకులను వదిలిపెట్టాలంటూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ప్రకటించడంతో.. శ్రద్ధానంద్ వారిలాగే తనకు కూడా విముక్తి కల్పించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు.