న్యూఢిల్లీ, నవంబర్ 11: ప్రయాణికులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. యూటీఎస్ యాప్‌పై అన్ రిజర్వ్డ్(జనరల్) టికెట్ల బుకింగ్‌కు సంబంధించిన దూర పరిమితిని సడలిస్తున్నట్టు ప్రకటించింది. ఇకపై నాన్ సబర్బన్ సెక్షన్ ప్రాంతాల్లో 20 కిలోమీటర్లు, సబర్బన్ ఏరియాల్లో 5 కిలోమీటర్ల వరకు యాప్‌లో జనరల్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఇది ఆయా ఏరియాల్లో వరుసగా 5 కిలోమీటర్లు, 2కిలోమీటర్లుగా ఉండేది. ఈ మేరకు రైల్వే బోర్డు అన్ని రైల్వే జోన్లకు కొత్త మార్గదర్శకాలు జారీచేసింది. యూటీఎస్ యాప్‌లో అన్ రిజర్వ్డ్ టికెట్ల బుకింగ్ దూరపరిమితిని పెంచాలని రోజువారీ ప్యాసింజర్ రైళ్ల ప్రయాణికులు దీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్నారు. జనరల్ టికెట్ కోసం క్యూలో నిలబడకుండా, రైలు బయలుదేరే కొద్ది సమయానికి ముందు ఇంటివద్దనే లేదా రైల్వేస్టేషన్‌కు వస్తున్న సమయంలో బుకింగ్ చేసుకొనే అవకాశాన్ని యూటీఎస్ యాప్ కల్పిస్తుంది.