హరిద్వార్: ఉత్తరాఖండ్‌లోని (Uttarakhand) హరిద్వార్‌లో (Haridwar) దారుణం చోటుచేసుకున్నది. మేనల్లుడి అంత్యక్రియలకు (Nephew Funeral) వెళ్లిన మేనమామను గొంతు కోసి చంపేశారు అతని బంధువులు. ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌కు చెందిన సోనూ చౌహాన్.. సోదరి కుమారుడు కునాల్ పండిర్ (22) తన నివాసంలో జరిగిన అగ్నిప్రమాదంలో బుధవారం రాత్రి మృతిచెందాడు. దీంతో గురువారం హరిద్వార్‌లో అతని అంత్యక్రియలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేనమామ అయిన సోనూ చౌహాన్ హాజరయ్యారు.
అయితే ఈ సందర్భంగా కునాల్ కుటుంబ సభ్యులకు గొడవ జరిగింది. ఇందులో కునాల్ చిన్నాన్న నమన్‌తో సోనూ చౌహాన్‌కు వాగ్వాదం జరిగింది. గతంలో కూడా వీరిద్దరి మధ్య విబేధాలు ఉండటంతో.. ఆ కోపాన్ని మనసులో పెట్టుకున్న నమన్.. చౌహాన్‌ను గొంతుకోశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన అతడు ఘటనా స్థలంలోనే మరణించారు. మృతుని సోదరి ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. విచారణ సందర్భంగా నేరాన్ని ఒప్పుకున్న నమన్.. గతంలో తమకు గొడవ జరిగింది, సమయం దొరకడంతో ఇప్పుడు చంపేశానని చెప్పారు. అయితే ఈ హత్యలో నమన్తోపాటు ఇంకెవరి పాత్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.