హైదరాబాద్ సిటీబ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో టిఫిన్ బాక్స్ బాంబులతో భారీ పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. ఈ నెల 21, 22న బాంబులతో అడవుల్లో రిహార్సల్స్ చేసి, అక్కడ వచ్చిన ఫలితాలతో దేశవ్యాప్తంగా పేలుళ్లకు పాల్పడాలని ఈ ముఠా స్కెచ్ వేసింది. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన ఆరుగురు యువకులతో కూడిన ఈ ముఠా హైదరాబాద్‌లో ఇటీవల మూడు రోజుల పాటు మకాం వేసి సుదీర్ఘంగా మంతనాలు జరిపినట్లు విచారణలో వెల్లడైంది. సౌదీ నుంచి ఐసిస్ హ్యాండ్లర్లు ఇచ్చే ఆదేశాలను ఈ ముఠా అనుసరిస్తున్నట్లు బయటపడింది. ఈ కేసును తేల్చేందుకు ఎన్ఐఏ రంగంలోకి దిగింది.
హైదరాబాద్‌లో బాంబు పేలుళ్లకు కుట్ర చేస్తున్నారనే సమాచారంతో విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రహ్మన్(29)ను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించడంతో సికింద్రాబాద్ బోయిగూడకు చెందిన లిఫ్ట్ ఆపరేటర్ సమీర్(28) వివరాలు తెలిశాయి. సమీర్‌ను తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని విజయనగరం తరలించారు. ఇద్దరు నిందితుల రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు ఉన్నట్లు తెలిసింది. విజయనగరానికి చెందిన సిరాజ్ తండ్రి పోలీసు విభాగంలో పనిచేస్తున్నాడు.
గతంలో సోషల్‌మీడియాలో ఉగ్రవాద సానుభూతిపరులకు సంబంధించిన పోస్టులు పెట్టడం, వారి పోస్టులకు ఆకర్షితుడు కావడంతో అతడ్ని అదుపులోకి తీసుకొని పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే తీరు మార్చుకోని సిరాజ్‌కు సోషల్ మీడియాలో సమీర్ పరిచయమయ్యాడు. అలాగే మహారాష్ట్ర, కర్ణాటకకు చెందిన మరో నలుగురు యువకులు సిరాజ్ భావజాలానికి ఆకర్షితులయ్యారు. సిరాజ్ ఆధ్వర్యంలోని అల్హింద్ ఇత్తేహాదుల్ ముస్లిమన్ అనే పేరుతో ఓ ముఠాను ఏర్పాటుచేసుకున్నారు. వీరందరికి సౌదీ ఉగ్రవాద సంస్థ ఆదేశాలిస్తున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది.
సిరాజ్, సమీర్‌తో పాటు మరో నలుగురు ఇటీవల హైదరాబాద్‌లో కలుసుకొని వివిధ అంశాలపై మాట్లాడుకున్నారు. బాంబులు తయారు చేసేందుకు సిరాజ్, అమెజాన్ నుంచి అమ్మోనియా నైట్రేట్, సల్ఫర్, అల్యూమినియం పౌడర్‌ను తెప్పించాడు. యూట్యూబ్‌లో బాంబులు తయారు చేసే విధానాన్ని చూసి స్వయంగా బాంబులు తయారు చేయాలని ప్లాన్ చేశాడు.
తయారు చేసిన బాంబులను ఈ నెల 21, 22వ తేదీలలో విజయనగరం ప్రాంతంలోని నిర్మానుష్యంగా ఉండే అటవీ ప్రాంతాలలో పేల్చి వాటిని పరీక్షించాలని స్కెచ్ వేశారు. టిఫిన్ బాక్స్ బాంబులను ఈజీగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకుపోయే అవకాశముంటుందని, వాటిని తయారు చేయాలని ప్లాన్ చేశారు. రిహార్సల్స్ సక్సెస్ కాగానే సౌదీ నుంచి ఉగ్రవాద హ్యాండ్లర్స్ ఇచ్చే ఆదేశాలతో సిరాజ్ గ్రూప్‌లోని మిగతా నలుగురు బాంబులు పెట్టే ప్రాంతాలను ఎంపిక చేస్తారు. ఇందుకు సిరాజ్‌కు సౌదీ నుంచి భారీ మొత్తంలో డబ్బు ముట్టినట్టు పోలీసుల విచారణలో తేలింది.
ఉగ్రవాద ముఠాలతో సోషల్‌మీడియా వేదికగా సిరాజ్ సాగిస్తున్న వ్యవహారాలను గుర్తించిన విజయనగరం పోలీసులు తీగలాగితే హైదరాబాద్‌తో పాటు ముంబై, బెంగుళూర్లో డొంక కదిలింది. సిరాజ్ సెల్‌ఫోన్, బ్యాంకు లావాదేవీలను విశ్లేషిస్తున్నారు. ఉగ్రముఠాలోని మిగిలిన నలుగురి కోసం గాలింపు మొదలైంది. వివిధ రాష్ర్టాలతో ఈ ముఠా నెట్వర్క్ ఉండడంతో ఎన్ఐఏ రంగంలోకి దిగింది. హైదరాబాద్‌లోని సమీర్ కాంటాక్ట్స్‌పై తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు ఆరా తీస్తున్నారు.