న్యూఢిల్లీ: ఓటీటీలతో పాటు సోషల్ మీడియాల్లో అశ్లీల కాంటెంట్‌ను బ్యాన్ చేయాలా వద్దా అన్న అంశంపై కేంద్ర ప్రభుత్వ వివరణ కోరింది సుప్రీంకోర్టు(Supreme Court). ఈ నేపథ్యంలో అత్యున్నత న్యాయ స్థానం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. సెక్సువల్ కాంటెంట్ స్ట్రీమింగ్ విషయంలో తీసుకోవాల్సిన చర్యలు, అమలు చేయాల్సిన నిబంధనల గురించి వెల్లడించాలని కేంద్రాన్ని సుప్రీం కోరింది. జస్టిస్ బీఆర్ గవాయి, ఆగస్టిన్ జార్జ్ మాషితో కూడిన ధర్మాసనం ఈ అంశాన్ని విచారించింది. ఓటీటీతో పాటు సోషల్ మీడియాల్లో అశ్లీల కాంటెంట్ అంశంపై నిర్ణయం తీసుకునే అధికారం ఎగ్జిక్యూటివ్, శాసన వ్యవహారాల పరిధిలో ఉంటుందని కోర్టు చెప్పింది. ఎగ్జిక్యూటివ్, శాసన వ్యవహారాలను ఆక్రమిస్తున్నట్లు ఇప్పటికే సుప్రీంకోర్టుపై ఆరోపణలు వస్తున్నాయని జస్టిస్ గవాయి తన తీర్పులో చెప్పారు.
కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. సెక్సువల్ కాంటెంట్ అంశంలో ప్రభుత్వమే ఏదైనా చేయాలని సుప్రీం ధర్మాసనం తుషార్ మెహతాను కోరింది. ప్రస్తుతం కొన్ని నిబంధనలు అమలులో ఉన్నాయని, కొన్నింటి అంశంలో సమాలోచనలు జరుగుతున్నట్లు ఆయన చెప్పారు. పిటీషనర్ల తరపున అడ్వకేట్ విష్ణు శంకర్ జైన్ వాదించారు. లైంగిక ప్రేరేపిత కాంటెంట్‌ను నియంత్రించే అంశంలో నిబంధనలు రూపొందించాలని నేషనల్ కాంటెంట్ కంట్రోల్ అథారిటీని అయిదుగురు పిటీషనర్లను కోరారు. ఆ పిల్‌పై ఇవాళ సుప్రీం వాదనలు చేపట్టింది. కేంద్రంతో పాటు ఎక్స్ కార్పొరేషన్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, ఉల్లు డిజిటల్, ఆల్ట్‌బాలాజీ, ఎంయూబీఐ, గూగుల్, యాపిల్, మెటా సంస్థలకు కూడా సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది.