PM Modi : ప్రజాస్వామ్య ప్రక్రియల్లో యువత భాగం కావాలని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) పిలుపునిచ్చారు. ఓటు హక్కును వినియోగించుకోవడం కేవలం దేశ ప్రజల హక్కు మాత్రమే కాదని, దేశ భవిష్యత్తును రూపొందించడంలో మనకు ఉన్న బాధ్యత అని అన్నారు. ఓటు వేయడం రాజ్యాంగం మనకు ఇచ్చిన గొప్ప హక్కు అని చెప్పారు.
ఓటు ద్వారానే దేశ భవిష్యత్తుకు దారి ఏర్పడుతుందని ప్రధాని అన్నారు. దేశ అభివృద్ధి ప్రయాణంలో కీలకపాత్ర పోషించే భాగ్యవిధాతలు ఓటర్లేనని చెప్పారు. మన దేశ విధిని మార్చగలిగే శక్తి ప్రజలు వేసే ఓట్లకు ఉంటుందని తెలిపారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మై-భారత్ వాలంటీర్లకు రాసిన లేఖలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రజాస్వామ్య ప్రక్రియలను బలోపేతం చేయడానికి భారత ఎన్నికల కమిషన్ చేస్తున్న కృషిని ప్రధాని అభినందించారు. దేశంలో ఎన్నికలను ఈసీ నిబద్ధతతో నిర్వహిస్తోందని చెప్పారు. ఏదైనా రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినప్పుడు ఇతర ప్రాంతాలకు వెళ్లి స్థిరపడిన ఎందరో తమ గ్రామాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకుంటుంటారని మోదీ పేర్కొన్నారు.
హిమాలయాలలో, అండమాన్ దీవుల్లో, దట్టమైన అడవుల్లో ఉన్నా ఎన్నికల సమయానికి తమ స్వస్థలాలకు చేరుకుంటారని చెప్పారు. ఈ చర్యలు ప్రజాస్వామ్య విలువల పట్ల వారికున్న బాధ్యతను తెలియజేస్తాయని అన్నారు. రాబోయే తరాలు కూడా ఇదే నిబద్ధతతో ఉండాలని హితవు పలికారు. అదేవిధంగా భారత్ అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యం చాలా కీలకమని ప్రధాని పేర్కొన్నారు.