కోల్కతా, ఏప్రిల్ 29: పశ్చిమ బెంగాల్లో బుధవారం జరిగిన రెండో, ఆఖరి విడత అసెంబ్లీ ఎన్నికల్లో భారీ పోలింగ్ నమోదైంది. రాత్రి 7.45 గంటలకు 91.66 శాతం ఓటింగ్ నమోదవ్వగా, తర్వాత దానిని 92.48గా సవరించారు. ఇంకా లక్షలాది మంది ఓటర్లు ఓటు వేసేందుకు లైన్లలో వేచి ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఏప్రిల్ 23న జరిగిన మొదటి విడత ఎన్నికల్లో 93.19 శాతం పోలింగ్ నమోదైన విషయం తెలిసిందే.
142 నియోజకవర్గాలకు జరిగిన రెండో విడత ఎన్నికల్లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొనడం కన్పించింది. రెండు విడతల పోలిం గ్ శాతం పరిశీలిస్తే రాష్ట్రంలో సరాసరి 92.84 ఓటింగ్ శాతం నమోదైనట్టు ప్రకటించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత బెంగాల్ రాష్ట్ర చరిత్రలో ఇంత అధికంగా పోలింగ్ శాత ం నమోదవ్వడం ఇదే ప్రథమమని తెలిపారు. 15 ఏండ్ల పాటు రాష్ట్రం లో అధికారంలో ఉన్న మమతా బెనర్జీ మరోసారి అధికారంలో కొనసాగాలని భావిస్తుండగా, తొలిసారిగా బెంగాల్ పీఠాన్ని అధిష్ఠించేందుకు బీజేపీ ఉవ్విళ్లూరుతున్నది.
పోలింగ్ సందర్భంగా పలుచోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. డైమండ్ హార్బర్లోని పలు కేంద్రాల్లో ఈవీఎంలలో కమలం గుర్తు కనిపించకుండా బ్లాక్ చేశారని బీజేపీ ఆరోపించింది. దీనిపై ఈసీ దర్యాప్తునకు ఆదేశించింది. ఆరోపణలు నిజమని తేలితే రీపోలింగ్ నిర్వహిస్తామని ప్రకటించింది. మరోవైపు ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగడం లేదని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణ చేశారు. ఎన్నికల నిమిత్తం రాష్ట్రంలో మోహరించిన కేంద్ర బలగాలు బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నాయని విమర్శించారు. తమ పార్టీ కార్యకర్తలను వారు భయభ్రాంతులకు గురి చేసి పోలింగ్ బూత్ల నుంచి వెళ్లగొట్టారని మమత తెలిపారు.