Congress | న్యూఢిల్లీ, అక్టోబర్ 9: గెలుపు ఖాయమనుకున్న హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఇండియా కూటమిలో చిచ్చు పెట్టింది. ఆ పార్టీ అహంకారం, అతి విశ్వాసం వల్లే ఓడిపోయిందని మిత్రపక్షాలే దుమ్మెత్తిపోస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలను కాంగ్రెస్ వాడుకుంటున్నదని ఆరోపిస్తున్నాయి. హర్యానా ఫలితాల ప్రభావం రానున్న అసెంబ్లీ ఎన్నికలపైనా పడబోతున్నట్టు కనిపిస్తున్నది. ఇండియా కూటమి విచ్ఛిన్నమయ్యేలా పరిణామాలు మారుతున్నాయి. తమ బలం కాంగ్రెస్‌కు ఉపయోగపడుతుంది కానీ కాంగ్రెస్ వల్ల తమకేమీ లాభం లేదని ఇండియా కూటమి పార్టీలు భావిస్తున్నాయి. త్వరలో జరగనున్న పలు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను దూరం పెట్టాలని పలు పార్టీలు నిర్ణయానికి వచ్చాయి.
హర్యానాలో ఓటమితో కాంగ్రెస్ తీరుపై ఇండియా కూటమిలోని తృణమూల్ కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ‘కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనుకున్న చోట ప్రాంతీయ పార్టీలను కలుపుకోదు. ఆ పార్టీ బలంగా లేని రాష్ర్టాల్లో మాత్రం ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌ను కలుపుకోవాలనే అహంకారం, హక్కుగా భావించడం, ప్రాంతీయ పార్టీలను చిన్నచూపు చూడటమే ఈ పరాభవానికి కారణం’ అని తృణమూల్ ఎంపీ సాకేత్ గోఖలే తీవ్రస్థాయిలో విమర్శించారు. మిత్రపక్షాలను కలుపుకుపోవడంలో కాంగ్రెస్ విఫలమైందని, స్థానిక నేతలను అవిధేయతను అదుపు చేయలేకపోయిందని శివసేన(ఉద్ధవ్ వర్గం) విమర్శించింది. గెలవాల్సిన ఆటలోనూ ఓడిపోయే సామర్థ్యం కాంగ్రెస్‌కు ఉందని ఎద్దేవా చేసింది. కూటమిలో పెద్దన్నగా ఏ పార్టీ భావించొద్దని కాంగ్రెస్‌ను ఉద్దేశించి శివసేన(ఉద్ధవ్) నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఆత్మపరిశీలన చేసుకోవాలని, పొత్తు సూత్రాలను, ప్రాంతీయ పార్టీలను గౌరవించాలని ఆర్జేడీ స్పష్టంచేసింది.
సమాజ్‌వాదీ పార్టీ కూడా కాంగ్రెస్‌కు దూరమవుతున్నది. ఉత్తరప్రదేశ్‌లో త్వరలో 10 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. పొత్తులో భాగంగా తమకు ఐదు స్థానాలు కేటాయించాలని కాంగ్రెస్ కోరుతున్నది. అయితే, సమాజ్‌వాదీ పార్టీ మాత్రం 2-3 సీట్లకు మించి ఇవ్వొద్దని భావిస్తున్నది. కాంగ్రెస్‌కు సంబంధం లేకుండానే ఆరు స్థానాలకు అభ్యర్థులను కూడా ప్రకటించింది.
కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకోవాలని ఆప్ నిర్ణయించింది. త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ఆ పార్టీ ప్రకటించింది. అతివిశ్వాసం కలిగిన కాంగ్రెస్‌పై, అహంకార బీజేపీపై ఒంటరిగా పోటీ చేసే సామర్థ్యం తమ పార్టీకి ఉందని ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ ప్రకటించారు. గత పదేండ్లుగా ఢిల్లీలో కాంగ్రెస్‌కు ఒక్క అసెంబ్లీ సీటు లేకపోయినప్పటికీ తాము లోక్‌సభ ఎన్నికల్లో మూడు సీట్లు ఇచ్చామని, అయినా హర్యానాలో ఆ పార్టీ మిత్రపక్షాలను కలుపుకోలేదని ఆమె ఆరోపించారు.