ముంబై, మే 15: దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం శివసేనకు కంచుకోట లాంటిది. గత మూడు దశాబ్దాలుగా ఎన్నిక ఏదైనా ముంబై నగరంలో శివసేన బలమైన ప్రభావం చూపిస్తూ వస్తున్నది. మరాఠా అనుకూల భావజాలంతో నగరంలో ఆ పార్టీ బలమైన ఓటుబ్యాంకును సృష్టించుకున్నది. అయితే, 2022 జూన్‌లో శివసేన పార్టీ నిట్టనిలువునా చీలిపోవడంతో ఇప్పుడు ముంబై రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. పార్టీలో చీలిక తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు ఇవి. పార్టీని చీల్చి ఎన్నికల సంఘం నుంచి అసలైన శివసేనగా గుర్తింపు పొందగలిగిన ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని పార్టీకి ముంబై నగరంలో లోక్‌సభ ఎన్నికలు అగ్నిపరీక్షగా మారాయి. మరోవైపు ముంబైవాసుల్లో తమకే ఆదరణ ఉన్నదని నిరూపించుకోవాల్సిన జీవన్మరణ సమస్యగా ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు(ఉద్ధవ్) ఈ ఎన్నికలు మారాయి. పేరుకు మహా వికాస్ అఘాఢీ(ఇండియా కూటమి), మహాయుతి(ఎన్డీఏ) కూటముల మధ్యే పోరు అయినప్పటికీ ముంబై నగరంలో మాత్రం రెండు శివసేనల మధ్యనే అసలుసిసలు పోటీ నెలకొన్నది.
గత రెండు ఎన్నికల్లో ఎన్డీయే క్లీన్‌స్వీప్
ముంబై నగరం విస్తరించి ఉన్న ముంబై మెట్రోపాలిటన్ రీజియన్(ఎంఎంఆర్) పరిధిలో 10 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. వీటిల్లో కల్యాణ్, థాణే, ముంబై వాయువ్య, ముంబై దక్షిణ మధ్య, ముంబై దక్షిణ స్థానాల్లో శివసేన(షిండే), శివసేన(ఉద్ధవ్) పరస్పరం తలపడుతున్నాయి. పాల్ఘర్, ముంబై ఈశాన్య, ముంబై ఉత్తర మధ్య స్థానాల్లో బీజేపీ, శివసేన(ఉద్ధవ్) పోటీ పడుతున్నాయి. భీవండిలో బీజేపీ, ఎన్సీపీ మధ్య, ముంబై ఉత్తర స్థానంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొన్నది. గత రెండు ఎన్నికల్లోనూ ఈ పది స్థానాలను అవిభాజ్య శివసేన, బీజేపీతో కూడిన ఎన్డీయే కూటమి క్లీన్‌స్వీప్ చేసింది. 2014లో బీజేపీ 5, శివసేన 5, 2019లో బీజేపీ 4, శివసేన 6 స్థానాలను గెలుచుకున్నాయి. ఈసారి మాత్రం శివసేన ఓటుబ్యాంకు ఏక్నాథ్ షిండే వైపు ఉంటుందా? ఉద్ధవ్ ఠాక్రే వైపు ర్యాలీ అవుతుందా? అనే అంశంపై ముంబైలోని 10 స్థానాల్లో గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి.
రెండు శివసేనలకు సవాల్‌గా ఐదు స్థానాలు
మొత్తం 10 స్థానాల్లోనూ గెలుపోటములను నిర్ణయించడంలో శివసేన ఓటుబ్యాంకే కీలకమైనప్పటికీ శివసేన(షిండే), శివసేన(ఉద్ధవ్) మధ్య హోరాహోరీ పోరు నెలకొన్న ఐదు స్థానాల్లో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇందులో థాణే జిల్లా ఇప్పటివరకు ఏక్నాథ్ షిండేకు బలమైన ప్రాంతంగా ఉండేది. థాణే జిల్లా గతంలో దివంగత శివసేన నేత, ధర్మవీర్‌గా ప్రాచుర్యం పొందిన ఆనంద్ దిఘేకు కంచుకోట. ఆయన ఉన్నప్పుడు ఇక్కడ బాల్‌ఠాక్రే జోక్యం కూడా ఉండేది కాదు. ఆనంద్ దిఘే మరణం తర్వాత ఆయన శిష్యుడైన ఏక్నాథ్ షిండే థాణేలో పట్టు నిలుపుకుంటూ వచ్చారు. శివసేన(షిండే) కార్యాలయం కూడా థాణేలోని ఆనంద్ దిఘే నివాసంలోనే ఉంది. గత రెండు ఎన్నికల్లోనూ థాణే జిల్లాలోని కల్యాణ్ స్థానం నుంచి ఏక్నాథ్ కుమారుడు శ్రీకాంత్ షిండే భారీ మెజారిటీతో గెలిచి ఇప్పుడు మూడోసారి బరిలో నిలిచారు. కల్యాణ్, థాణే స్థానాలను తిరిగి గెలిపించుకొని తన సొంత ప్రాంతంలో ఏక్నాథ్ పట్టు నిలుపుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక, ముంబై వాయువ్య, ముంబై దక్షిణ మధ్య, ముంబై దక్షిణ స్థానాల్లో శివసేన(ఉద్ధవ్)కి బలమున్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఎన్డీయేను దెబ్బతీస్తున్న ఉద్ధవ్‌పై సానుభూతి
ఎన్డీయే తిరిగి అధికారంలోకి రావాలన్నా, గత ఎన్నికల్లో సాధించిన స్థానాల సంఖ్యను నిలుపుకోవాలన్నా ముంబై నగరం చాలా కీలకం. అయితే, శివసేన పార్టీని చీల్చడం, ఉద్ధవ్ ఠాక్రేని ముఖ్యమంత్రి పదవి నుంచి దించేయడం ఎన్డీయే విజయావకాశాలను ఈసారి దెబ్బతీసే అవకాశం ఉంది. ముఖ్యంగా, ముంబై ఓటర్లలో ఉద్ధవ్‌పై సానుభూతి ఉన్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నగరంలో శివసేనకు ఉన్న బలమైన ఓటుబ్యాంకు కూడా మెజారిటీ ఉద్ధవ్ వెంటే ఉందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇదే జరిగితే ఈసారి ఎన్డీయేకు ఈ 10 స్థానాల్లో ఇబ్బందకర పరిస్థితులు ఉండొచ్చు. అయితే, హిందూ భావజాలం కలిగిన శివసేన.. ఇండియా కూటమిలో కలవడం పట్ల ఉద్ధవ్ తీరుపై శివసేన ఓటుబ్యాంకులో కొంత అసంతృప్తి ఉందనే వాదన కూడా ఉంది. గత రెండు ఎన్నికల్లోనూ ఈ 10 స్థానాల్లో ఎన్డీయే భారీ మెజారిటీలు దక్కించుకుంది. ఈసారి మాత్రం మహా వికాస్ అఘాఢీ నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్నది.