కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ బీర్బుమ్లో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నిష్పక్షపాతంగా విచారణ జరుపాలని సీఎం మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. సీబీఐ విచారణను ప్రభావితం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తే సహించేది లేదని హెచ్చరించారు. దీనిని ఎదుర్కొనేందుకు నిరసనకు సిద్ధమని అన్నారు. రామ్పూర్హట్లోని బగ్తుయ్ గ్రామంలో ఈ నెల 22న జరిగిన హింసాకాండలో ఇద్దరు పిల్లలతో సహా ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు.
కాగా, ఈ ఘటన వెనుక ఏదో కుట్ర ఉన్నదని ఆదివారం ఒక కార్యక్రమంలో మాట్లాడిన మమత ఆరోపించారు. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి హైకోర్టు అప్పగించడం మంచి నిర్ణయమేనని అన్నారు. అయితే బీజేపీ డైరెక్షన్‌ను సీబీఐ అనుసరిస్తే, దీనిపై నిరసన తెలిపేందుకు సిద్ధమేనని ఆమె హెచ్చరించారు.
మరోవైపు ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, త్రిపుర, అస్సాంలో కూడా ఇలాంటి ఘటనలు చాలా జరిగాయని సీఎం మమత గుర్తు చేశారు. అయితే ఆయా ఘటనా స్థలాలకు తమ పార్టీ నేతలు, కార్యకర్తలను చేరుకోనివ్వలేదని విమర్శించారు. కానీ బీర్బుమ్లో తాము ఏ రాజకీయ పార్టీని నిలువరించలేదన్నారు.
తృణమూల్ కార్యకర్తను మరో పార్టీ కార్యకర్త హత్య చేశారని, అయితే ఎక్కడ చూసినా టీఎంసీపైనే విమర్శలు చేస్తున్నారని మమత ఆరోపించారు. దీంతో ఈ విషయాన్ని పరిశోధించడానికి, బీర్బుమ్ సంఘటనకు అసలు కారణాన్ని తెలుసుకోవడానికి తాము అనేక చర్యలు తీసుకున్నట్లు ఆమె చెప్పారు.