న్యూఢిల్లీ, డిసెంబర్ 14: రైతులకు తాకట్టు లేకుండా రూ.2 లక్షల వరకు రుణాన్ని అందించే నిర్ణయాన్ని వచ్చే ఏడాది జనవరి 1 నుంచే అమలు చేయాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా బ్యాంకులకు మార్గదర్శకాలు జారీ చేసింది. కొత్త రుణ నిబంధనల గురించి రైతులకు అవగాహన కల్పించాలని సూచించింది.
పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయిన నేపథ్యంలో చిన్న, సన్నకారు రైతులకు రుణ సదుపాయాన్ని పెంచడం కోసం వ్యవసాయ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలో 86 శాతం మంది రైతులు చిన్న, సన్నకారు వ్యవసాయదారులేనని, రుణ పరిధిని పెంచడం ద్వారా వారికి మేలు జరుగుతుందని వ్యవసాయ శాఖ పేర్కొన్నది.