ప్రయాగ్‌రాజ్, జనవరి 23: తాము జారీ చేసిన నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ కొన్ని బ్యాంకులు విచ్చలవిడిగా అధిక వడ్డీ రేట్లను వసూలు చేస్తున్నా దేశ కేంద్ర బ్యాంకైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మౌన ప్రేక్షకుడిలా చూస్తూ ఉందని అలహాబాద్ హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. ఆర్బీఐ మార్గదర్శకాలు ప్రకటిస్తుంది తప్ప, ఆశ్చర్యంగా దానిని అమలు చేయదని జస్టిస్‌లు మహేష్ చంద్ర త్రిపాఠి, ప్రశాంత్ కుమార్ ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఈ కేసులో వినియోగదారునికి న్యాయం చేయడంలో విఫలమైన బ్యాంక్ అంబుడ్స్‌మన్ తిరిగి అతని సమస్య పరిశీలించి ఫిర్యాదుదారునికి న్యాయం చేయాలని ఆదేశించింది. మన్మీత్ సింగ్ అనే వ్యక్తి స్టాండర్డ్ చార్టెడ్ బ్యాంక్ నుంచి 9 లక్షలు రుణంగా తీసుకున్నాడు. అతను క్రమం తప్పకుండా రుణ బకాయి చెల్లించినా అతని నుంచి రూ.27 లక్షలు వసూలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా 12.5 శాతానికి బదులుగా, 17 శాతానికి పైగా వడ్డీ వసూలు చేశారు. దీనిపై బ్యాంక్ అంబుడ్స్‌మెన్‌ను సంప్రదించినా అతనికి న్యాయం జరగలేదు. దీంతో అతడు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు.