జగిత్యాల, జూన్ 18 : జగిత్యాల జిల్లా కేంద్రంలోని 36వ వార్డుకు చెందిన రేవెల్ల రవీందర్(55) సోమవారం ఇజ్రాయెల్ దేశంలో గుండెపోటుతో మృతిచెందగా, ఆలస్యంగా తెలిసింది. రవీందర్ ఉపాధి కోసం ఇజ్రాయెల్‌కు రెండేళ్ల క్రితం వెళ్లాడు. ప్రస్తుతం ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతుండడంతో ఇజ్రాయెల్‌లోని ప్రజలందరినీ బంకర్లలోకి తీసుకెళ్లి ఉంచారు. ఇరాన్ మిస్సైల్ బంకర్ పక్కనే పడడంతో ఆ భారీ శబ్దానికి రవీందర్ మృత్యువాత పడ్డాడని బంధువులు తెలిపారు. రవీందర్‌కు భార్య విజయలక్ష్మి, కూతురు ఆకాంక్ష, కొడుకు మంజునాథ్ ఉన్నారు. కూతురు పెళ్లి కాగా, కొడుకు బధిరుడని స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని త్వరగా ఇండియాకు తెప్పించడానికి ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్ కుమార్, ఎన్ఆర్ఐ అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి దృష్టికి తీసికెళ్లినట్లు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ అడువాల జ్యోతి పేర్కొన్నారు. ఇండియన్ ఎంబసీ సహకారంతో మృతదేహాన్ని త్వరగా ఇండియాకు రప్పిస్తామని వారు హామీ ఇచ్చారన్నారు.
ఇరాన్లో చిక్కుకున్నవారి కోసం ‘ఆపరేషన్ సింధు’
న్యూఢిల్లీ : ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పరస్పర దాడులు తీవ్రమవుతుండటంతో ఇరాన్‌లోని భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ సింధు’ను ప్రారంభించింది. ఉత్తర ఇరాన్ నుంచి 110 మంది భారతీయ విద్యార్థులను తీసుకొస్తున్నది. వీరిలో 90 మంది జమ్ముకశ్మీరుకు చెందినవారు. వీరంతా మంగళవారం అర్మేనియాలోని యెరవాన్కు చేరుకున్నారు. అక్కడి నుంచి బుధవారం మధ్యాహ్నం 2.55 గంటలకు ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీకి తీసుకొస్తున్నారు. ఈ విమానం గురువారం తెల్లవారుజామున న్యూఢిల్లీకి చేరుకుంటుంది. వీరిని సురక్షితంగా భారత దేశానికి తీసుకొచ్చేందుకు సహకరించినందుకు ఇరాన్, అర్మేనియాకు విదేశాంగ శాఖ ధన్యవాదాలు తెలిపింది.