Ratan Tata | న్యూఢిల్లీ, అక్టోబర్ 16: ఇటీవల కన్నుమూసిన వ్యాపార-పారిశ్రామిక దిగ్గజం, టాటా గ్రూప్ మాజీ చీఫ్ రతన్ టాటా.. భారత మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావును కొనియాడుతూ గతంలో రాసిన ఓ లేఖ ఇప్పుడు వెలుగుచూసింది. దేశంలో తెచ్చిన కీలక ఆర్థిక సంస్కరణల వెనుకున్న మీ కృషి అభినందనీయమని ఆ లేఖలో టాటా ప్రశంసించారు. ‘నవ భారత నిర్మాణం కోసం మీరు ఎంతో ధైర్యంగా, సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయాలకు ప్రతీ భారతీయుడూ మీకు రుణపడి ఉండాల్సిందే’నని అందులో పేర్కొన్నారు. మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావును ‘భారత ఆర్థిక సంస్కరణల పితామహుడు’గా కీర్తిస్తారన్న విషయం తెలిసిందే.
1991లో ఆర్థిక సంక్షోభంతో దివాలా దిశగా అడుగులు వేస్తున్న భారత్‌ను ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ ద్వారా గొప్ప సంస్కరణలను ప్రవేశపెట్టి పీవీ ఆదుకున్న సంగతీ విదితమే. అయితే 1996 మే 16న ప్రధానిగా పీవీ దిగిపోయారు. ఈ క్రమంలోనే ఆ ఏడాది ఆగస్టు 27న రతన్ టాటా పీవీని ఉద్దేశించి వ్యక్తిగతంగా ఓ లేఖ రాశారు. ఆర్పీజీ గ్రూప్ చైర్పర్సన్ హర్షా గోయెంకా సోషల్ మీడియా ద్వారా ఈ లేఖను తాజాగా పోస్ట్ చేశారు. ‘ఓ మంచి మనసున్న వ్యక్తి రాసిన గొప్ప లేఖ’ అని దీన్ని పేర్కొన్నారు. ఇప్పుడిది వైరల్‌గా మారింది. ఇక ఆ లేఖలో ‘మీ గురించి కొన్ని అమానవీయ, అవమానకర విమర్శలు వినిపిస్తున్నాయి. వాటిని చదివిన నేను మీకు ఈ లేఖ రాయాల్సి వస్తున్నది. మీపట్ల ఎవరు ఏ రకంగా మాట్లాడినా మీపై నాకున్న గౌరవం ఎప్పటికీ పోదు. కష్ట సమయాల్లో దేశాభివృద్ధికి అవసరమైన ఆర్థిక సంస్కరణల్ని తీసుకురావడంలో మీరు విజయం సాధించారు. ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుంది’ అంటూ పీవీపట్ల తనకున్న గౌరవాన్ని టాటా వ్యక్తం చేశారు. నాడు దేశంలో ఎల్పీజీ సంస్కరణలు, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ను తీసుకొచ్చి ప్రపంచ స్థాయిలో భారత్‌ను పీవీ నిలబెట్టారు.