లక్నో: ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్య పరికరాలను ఎలుకలు నాశనం చేశాయి. అవి పని చేయకపోవడంతో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. దీంతో వైద్య పరీక్షల కోసం రోగులు ఇబ్బందులు పడుతున్నారు. (Rat menace in hospital) ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ సంఘటన జరిగింది. ఉర్సులా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకల బెడద నెలకొన్నది. ఆసుపత్రిలోని వివిధ వైద్య పరీక్షల పరికరాలను ఎలుకలు ధ్వంసం చేశాయి. దీంతో సుమారు రూ.25 లక్షల విలువైన డిజిటల్ ఎక్స్-రే యంత్రం పనిచేయడం లేదు. ఈ నేపథ్యంలో వైద్య సేవల కోసం రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కాగా, డిజిటల్ ఎక్స్‌రే యంత్రం ద్వారా రోజుకు రెండు వందల మందికి పైగా రోగులను పరిక్షించినట్లు ఆ ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. ఎలుకలు పాడు చేయడం వల్ల ఇది పనిచేయడం లేదని చెప్పారు. దీంతో కేవలం ఒక ఎక్స్-రే యంత్రంతో రోగులను పరీక్షిస్తున్నట్లు వెల్లడించారు.
మరోవైపు ఎలుకల బెడదను నివారించేందుకు మెయింటెనెన్స్ కంపెనీకి ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని ఆసుపత్రి డైరెక్టర్ తెలిపారు. ప్రస్తుతం ఎలుకలను కట్టడి చేసేందుకు కిటికీలు, తలుపుల వద్ద మెష్‌లు అమర్చడం వంటి చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.