ముంబై: మూడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన 65 ఏళ్ల వృద్ధుడికి కోర్టు మరణశిక్ష విధించింది. ఈ నేరం అత్యంత క్రూరమైనదని న్యాయమూర్తి అభివర్ణించారు. అందుకే అత్యంత అరుదైన తీర్పు ఇచ్చినట్లు వెల్లడించారు. (Death Penalty) మహారాష్ట్రలోని పూణె జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మే 1న నస్రాపూర్ గ్రామానికి చెందిన మూడేళ్ల బాలిక అదృశ్యమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు.
కాగా, 65 ఏళ్ల భీమ్రావ్ కాంబ్లే తినుబండారాల ఆశ చూపించి ఆ చిన్నారిని తీసుకెళ్లడం సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించింది. పసి దూడను చూపిస్తానని చెప్పిన వృద్ధుడు ఆ బాలికను పశువుల పాక సమీపంలోని షెడ్లోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆ చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆ బాలిక నోరు మూసి, ఛాతిపై గాయం చేసి ఆమెను హత్య చేశాడు. చిన్నారి కోసం వెతకగా మృతదేహం అక్కడ లభించింది.
మరోవైపు సీసీటీవీ ఫుటేజ్, ఇతర ఆధారాల సహాయంతో నిందితుడు భీమ్‌రావ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్నారిపై హత్యాచారం కేసు దర్యాప్తు కోసం సిట్‌ను ఏర్పాటు చేశారు. పోలీసులు పగలతో పాటు రాత్రులు కూడా పని చేశారు. 15 రోజుల్లో కీలక ఆధారాలు సేకరించారు. 55 మంది సాక్షుల వాంగ్మూలాలు రికార్డ్ చేశారు. 1,200 పేజీల వివరణాత్మక ఛార్జిషీట్‌ను కోర్టులో దాఖలు చేశారు.
కాగా, పూణే జిల్లా, సెషన్స్ కోర్టులో ఈ కేసుపై రోజువారీ విచారణ జరిగింది. మూడేళ్ల బాలిక కిడ్నాప్, లైంగిక వేధింపులు, అత్యాచారం, హత్య ఆరోపణల్లో నిందితుడు భీమ్రావ్ కాంబ్లేను దోషిగా కోర్టు నిర్ధారించింది. యావజ్జీవ కారాగార శిక్ష విధించాలన్న నిందితుడి తరఫు న్యాయవాది అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో ఎలాంటి దయ లేదా ఉదారత చూపాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది.
మరోవైపు సుప్రీంకోర్టు నిర్వచించిన ‘అరుదైన వాటిలోకెల్లా అరుదైన’ వర్గంలోకి ఈ నేరం వస్తుందని ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించారు. మరణశిక్షపై సుప్రీంకోర్టు ఇచ్చిన 12 కీలక తీర్పులను ప్రస్తావించారు. దీంతో ప్రాసిక్యూషన్ వాదనలతో కోర్టు ఏకీభవించింది.
ఈ నేరంలోని క్రూరత్వానికి ఎలాంటి కనికారం చూపే ఆస్కారం లేదని న్యాయమూర్తి ఎస్.ఆర్. సలుంఖే వ్యాఖ్యానించారు. ‘ఈ నేరం అత్యంత క్రూరమైనది. అరుదైన వాటిలో అత్యంత అరుదైనది. ఇది సమాజ అంతరాత్మనే కలచివేసేలా ఉన్నది. పసి బాలికపై తన కామ వాంఛ తీర్చుకునేందుకు నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు’ అని న్యాయమూర్తి అన్నారు. నేరం జరిగిన రెండు నెలల్లోపే దోషికి ఉరిశిక్ష విధిస్తూ సోమవారం తీర్పు ఇచ్చారు.