గువాహటి: లిఫ్ట్ ఇస్తానని చెప్పి ర్యాపిడో డ్రైవర్ ఒకరు యువతిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన అస్సాంలో చోటుచేసుకుంది. ఉపాధి కోసం గువాహటికి వచ్చిన యువతి ఉద్యోగం కోసం మాలిగావ్‌లో ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలో ర్యాపిడో డ్రైవర్‌గా పనిచేస్తున్న ఫకీర్ఖాన్ ఆమె దగ్గరకు వెళ్లి లిఫ్ట్ ఇస్తానని, ఉద్యోగం ఇప్పించడంలో సాయం చేస్తానని ఆమెను నమ్మించాడు.
తర్వాత ఆమెను కామాఖ్య రైల్వేస్టేషన్ దగ్గరలోని ఒక నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి లైంగికదాడి చేశాడు. గాయపడిన ఆమెను ఇంటర్ స్టేట్ బస్ టెర్మినల్ వద్ద వదిలిపెట్టి వెళ్లిపోయాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఇద్దరు రోగులపై డాక్టర్ లైంగిక దాడి
కటక్: చికిత్స కోసం వచ్చిన ఇద్దరు రోగులపై ఒడిశాలోని ఒక డాక్టర్ లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ ఘటన కటక్‌లోని ప్రముఖ ఎస్సీబీ మెడికల్ కాలేజీ, హాస్పిటల్లో ఈ నెల 11న చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ఈసీజీ తీయించుకోవడానికి ఇద్దరు మహిళలు కార్డియో విభాగానికి రాగా, డ్యూటీలో ఉన్న ఒక డాక్టర్ వారిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. దీంతో వారు తమ బంధువులకు తెలుపగా, వారు అతడికి దేహశుద్ధి చేశారు. తీవ్రంగా గాయపడిన డాక్టర్‌ను ఐసీయూకు తరలించారు.
మొండి సైనసైటిస్‌తో ఫంగల్ ఇన్ఫెక్షన్లు
న్యూఢిల్లీ: ఎంతకీ నయం కాని సైనసైటిస్ కారణంగా ఫంగల్ ఇన్ఫెక్షన్లు, ప్రాణాంతక సమస్యలు వచ్చే ముప్పు ఉంటుందని ఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్ వైద్యులు గుర్తించారు. ఇటీవల ఓ 27 ఏండ్ల వైద్యుడికి ఇదే సమస్య ఎదురైంది. మూడు నెలలుగా అతడికి కుడివైపు ముక్కు మూసుకుపోయింది. తర్వాత ఆయన కుడి కన్ను చూపు కోల్పోయాడు. సీటీ స్కాన్ తీయగా అతడు నాసల్ పాలిపోసిస్, ఫంగల్ సైనసైటిస్‌తో బాధ పడుతున్నాడని, దీని వల్ల కంటి నరంపై ఒత్తిడి కలుగుతోందని తేలింది. ఫంగస్ అన్ని సైనస్లకు వ్యాపించిందని గుర్తించారు. సర్జరీ చేయడంతో కంటిచూపు తిరిగి వచ్చింది.
రాందేవ్‌పై కోర్టు ధిక్కరణ కేసు మూసివేత
న్యూఢిల్లీ, ఆగస్టు 13: యోగా గురు రాం దేవ్ బాబాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ప్రకటనల ద్వారా అధునాతన వైద్య విధానాన్ని కించపరుస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించారంటూ సంస్థ వ్యవస్థాపకుడు రాం దేవ్ బాబా, ఎండీ బాలకృష్ణలపై దాఖలైన కేసులో వారిద్దరూ సమర్పించిన క్షమాపణను అంగీకరిస్తున్నట్టు పేర్కొన్న ధర్మాసనం కేసును మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఐఎంఏ ఈ కేసు దాఖలు చేసింది. దీనిపై పతంజలి యాజమాన్యం కోర్టుకు క్షమాపణ చెప్పడమే కాక, ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పింది.