చెన్నై, మే 5: శాంత స్వభావం, మృదుభాషిగా పేరొందిన ఎన్ రంగస్వామి.. పుదుచ్చేరి సీఎంగా ఐదవసారి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. ఏప్రిల్ 9న జరిగిన ఎన్నికల్లో ఆయన పార్టీ ఏఐఎన్ఆర్సీ నేతృత్వంలోని ఎన్డీయే ఘన విజయాన్ని అందుకుంది. పోటీ చేసిన 16 స్థానాల్లో ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ 12 స్థానాలను గెలుచుకుంది. 10 స్థానాల్లో పోటీచేసిన బీజేపీ నాలుగింటిని కైవసం చేసుకుంది.
కేవలం 30 మంది సభ్యులున్న పుదుచ్చేరి అసెంబ్లీలో మెజారిటీ మార్క్-16 కాగా, ఎన్డీయే కూటమి 18 చోట్ల విజయం సాధించింది. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష ఇండియా కూటమి ఆరు స్థానాలకు పరిమితమైంది. డీఎంకే ఐదు స్థానాలు, కాంగ్రెస్ ఒక స్థానంలో గెలుపొందాయి. సిట్టింగ్ ఎంపీ, మాజీ సీఎం వీ వైతిలింగంతో సహా కాంగ్రెస్ అభ్యర్థుల్లో చాలామంది ఓటమిపాలయ్యారు. కొత్తగా ఆవిర్భవించిన టీవీకే రెండు సీట్లు గెలుచుకుంది.