న్యూఢిల్లీ : విమానాశ్రయాల్లో అంతర్జాతీయ ప్రయాణికులకు కొవిడ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇవాళ్టి నుంచి ర్యాండమ్‌గా కొవిడ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుదల నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం ఇవాళ పరిస్థితిపై ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. సమావేశం అనంతరం పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
చైనా సహా వివిధ దేశాల నుంచి వచ్చే అంతర్జాతీయ ప్రయాణీలకు ర్యాండమ్‌గా నమూనాలను సేకరించనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం చైనాలో కరోనా కేసుల సునామీకి ప్రధాన కారణం బీఎఫ్.7 ఒమిక్రాన్ సబ్ వేరియంటే ప్రధాన కారణమని అధికార వర్గాలు పేర్కొన్నాయి. భారత్‌లో ఇప్పటి వరకు మూడు కేసులు నమోదయ్యాయి. అక్టోబర్‌లో గుజరాత్లో గుర్తించగా.. ఇప్పటి వరకు గుజరాత్లో రెండు, ఒడిశాలో ఒకే కేసు నమోదైంది. వేరియంట్‌కు ఇంక్యుబెషన్ చాలా తక్కువ అని అధికారులు తెలిపారు. అమెరికా, బ్రిటన్, బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, డెన్మార్క్‌లోనూ కేసులు నమోదయ్యాయి.
అయితే, సమావేశం అనంతరం ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ కొవిడ్ ముప్పు ఇంకా ముగియలేదని, అందరూ అలెర్ట్‌గా ఉండాలన్నారు. నిఘాను పెంచాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, సమావేశానికి హాజరైన నిపుణులు, సీరియర్ అధికారులు ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ పరిస్థితులపై వివరించారన్నారు. దేశంలో అర్హగత కలిగిన జనాభాలో 27-28శాతం మంది మాత్రమే కొవిడ్ బూస్టర్ డోస్ తీసుకున్నారని.. మిగితా వారంతా తీసుకోవాలని నీతి ఆయోగ్ సభ్యుడు (హెల్త్) డాక్టర్ వీకే పాల్ కోరారు. ప్రజలు రద్దీ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించాలని వీకే పాల్ విజ్ఞప్తి చేశారు.