అమరావతి : ఎన్డీయే కూటమిలో పౌర విమానయాన శాఖ మంత్రి(Aviation Minister) గా ప్రమాణస్వీకారం చేసిన కింజరపు రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) గురువారం బాధ్యతలు చేపట్టారు. ఢిల్లీలోని రాజీవ్‌గాంధీ భవన్లో ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం ఆయ మీడియాతో మాట్లాడుతూ కేబినెట్లో అత్యంత చిన్న వయస్సులో కీలక బాధ్యతలు అప్పగించిన ప్రధాని మోదీ( Narendra Modi) కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. యువతపై ప్రధానికి ఉన్న నమ్మకమేంటో అర్థమవుతుందని పేర్కొన్నారు. వందరోజుల ప్రణాళిక తయారుచేసి, దాన్ని అమల్లోకి తీసుకొస్తామని వెల్లడించారు. సాంకేతికత వినియోగంతో పౌరవిమానయానాన్ని మరింత ముందుకు తీసుకెళ్తానని స్పష్టం చేశారు.
సామాన్య ప్రయాణికుల కోసం ఈజ్ ఆఫ్ ఫ్లయింగ్ (Ease of Flying) పై దృష్టి పెడతామని వివరించారు. సమర్ధ నాయకత్వం ఎలా ఉండాలనేది చంద్రబాబు నుంచి నేర్చుకున్నానని ఆయన అన్నారు. ఎయిర్‌పోర్టుల నిర్మాణం వేగవంతం చేస్తామని తెలిపారు. 2014లో బాధ్యతలు చేపట్టిన అశోక్‌గజపతిరాజు విమానయాన శాఖలో మంచి పునాదులు వేశారని కొనియాడారు. ఉడాన్ స్కీమ్ కూడా ఆయన హయాంలోనే వచ్చిందని వెల్లడించారు.