Ramdas Athawale : తమిళనాడు బీఎస్పీ చీఫ్ కే ఆర్మ్‌స్ట్రాంగ్ కుటుంబసభ్యులను కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే బుధవారం పరామర్శించారు. ఆర్మ్‌స్ట్రాంగ్ కుటుంబసభ్యులకు అండగా నిలుస్తానని ఈ సందర్భంగా ఆయన భరోసా ఇచ్చారు. తామంతా ఆర్మ్‌స్ట్రాంగ్ కుటుంబానికి వెన్నంటి ఉంటామని దివంగత నేత కుటుంబసభ్యులకు స్పష్టం చేశామని తెలిపారు.
ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యకు బాధ్యులెవురో నిగ్గుతేల్చేందుకు నిష్పాక్షిక విచారణ చేపట్టాలని తాము కోరుతున్నామని చెప్పారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగుచూస్తాయని అన్నారు. చెన్నైలోని ఆర్మ్‌స్ట్రాంగ్ నివాసంలో కేంద్ర మంత్రి అథవాలే దివంగత నేత కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. కాగా, జులై 5న పెరంబూర్‌లోని ఆర్మ్‌స్ట్రాంగ్ నివాసం వద్ద పలువురు వ్యక్తులు ఆయనను దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే.
ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య తమిళనాడుతో పాటు జాతీయ రాజకీయాలను కుదిపివేసింది. హత్యానంతరం బీఎస్పీ చీఫ్ మాయావతి ఘటనా స్ధలాన్ని సందర్శించి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. ద్రవిడ రాజకీయాలు హత్యా రాజకీయాలుగా రూపుమార్చుకున్నాయని పాలక డీఎంకే సర్కార్‌పై విపక్షాలు విరుచుకుపడ్డాయి. డీఎంకే పాలనలో శాంతిభద్రతల పరిస్ధితి దిగజారిందని ఏఐఏడీఎంకే, బీజేపీ నేతలు స్టాలిన్ సర్కార్‌పై తీవ్రస్ధాయిలో విమర్శలు గుప్పించారు.
Read More :
కూలీలుగా వేషం మార్చి.. దొంగల ముఠా ఆట కట్టించిన పోలీసులు