ముంబై, జూలై 16: వ్యవసాయ కూలీలుగా మారు వేషం ధరించిన పోలీసులు, పుణె చుట్టుపక్కల వాహనాల్ని దొంగలిస్తున్న ముఠాను అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. గత ఏడాది మార్చి-ఏప్రిల్‌లో పుణె పోలీస్ క్రైం బ్రాంచ్‌లోని ఏడుగురు సభ్యులు రహస్య ఆపరేషన్ చేపట్టి.. దొంగల ముఠాలో ప్రధాన వ్యక్తి అజయ్ రమేశ్ షిండేను పట్టుకున్నారు.
దొంగతనం చేసిన 100 బైకులను స్వాధీనం చేసుకొని.. నెల రోజులపాటు ఆరా తీయగా, ఓ కామర్స్ గ్రాడ్యుయేట్ నేతృత్వంలో నలుగురు వ్యక్తులు గ్యాంగ్‌గా ఏర్పడి చేస్తున్న తతంగం బయటపడింది. దొంగలించిన వాహనాల్ని దారాశివ్, లాతూర్, బీద్ జిల్లాల్లో గ్రామస్థులకు అమ్ముతున్నట్టు పోలీసు విచారణలో తేలింది. రహస్య ఆపరేషన్‌లో భాగంగా కూలీలుగా మారిన పోలీసులు.. పొలాల్లో వంట చేసుకుంటూ, స్థానికులతో కలిసి కొన్ని సార్లు కూలి పనులకు కూడా వెళ్లారని తెలిసింది.