న్యూఢిల్లీ, జనవరి 6: ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ కమిటీకి నేతృత్వం వహిస్తున్న మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దా నిపై ప్రజలు సలహాలు, సూచనలు పంపాలంటూ విజ్ఞప్తి చేశారు. దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకు ప్రస్తుతమున్న చట్టపరమైన పరిపాలనా రూపాన్ని తగిన విధంగా ఎలా మార్పు చేయాలో తగిన సలహాలు, సూచనలు పంపాలంటూ ప్రకటనలో కోరారు.
వీటిని రాతపూర్వకంగా తమ వెబ్సైట్ onoe.gov.in లేదా ఈ-మెయిల్ sc-hlc@gov.inకు ఈ నెల 15లోగా పంపాలని కోరారు. గత ఏడాది సెప్టెంబర్లో ఏర్పాటైన ఈ కమిటీ ఇప్పటికే రెండు సార్లు సమావేశాలు నిర్వహించింది. దేశంలోని ఆరు జాతీయ, 33 ప్రాంతీయ పార్టీలతో పాటు గుర్తింపు పొందని పార్టీలకు లేఖ రాసి జమిలి ఎన్నికలపై తమ అభిప్రాయాన్ని కోరింది.