నిరుద్యోగంపై కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ప్రకటన పట్ల పౌరవిమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. నిరుద్యోగ గణాంకాలు ఆయనకు ఎక్కడ నుంచి వచ్చాయో తనకు తెలియదని మంత్రి వ్యాఖ్యానించారు. రామ్మోహన్ నాయుడు సోమవారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. దేశంలో ఇవాళ ఎన్నో ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు.
సరైన శిక్షణ ద్వారా యువతకు అవకాశాలను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. యువతకు నైపుణ్య శిక్షణ నిరంతర ప్రక్రియని, దీన్ని తాము కొనసాగిస్తామని స్పష్టం చేశారు. విదేశీ గడ్డపై రాహుల్ గాంధీ ఇలా మాట్లాడటం తగదని అన్నారు. గత పదేండ్లలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో ఉపాధి అవకాశాలను మెరుగుపరిచామని చెప్పారు.
ఇతర దేశాలకు వెళ్లిన సందర్భంలో రాహుల్ గాంధీ దేశాన్ని అవమానించేలా మాట్లాడటం సరైంది కాదని మంత్రి దుయ్యబట్టారు. దేశంలో పరిస్ధితిని మెరుగుపరిచేందుకు సాయపడేలా రాహుల్ గాంధీ ప్రయత్నించాలని హితవు పలికారు. రాహుల్ వ్యవహారశైలితో అంతర్జాతీయ వేదికపై దేశ ప్రతిష్ట మసకబారుతుందని రామ్మోహన్ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
Read More :
FD | డిపాజిట్లకు వేళాయెరా.. స్పెషల్ ఎఫ్డీలకు సమీస్తున్న గడువు