FD | సురక్షిత పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్ ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీ). అయితే ఆయా బ్యాంకులు డిపాజిటర్లను ఆకర్షించేందుకు కొన్ని ప్రత్యేక ఎఫ్డీలను తీసుకొచ్చాయి. వీటి కాలపరిమితి ఈ నెలాఖరుతో ముగుస్తున్నది. సాధారణ డిపాజిటర్లతో పోల్చితే సీనియర్ సిటిజన్లు, సూపర్ సీనియర్ సిటిజన్లకు పావు శాతం నుంచి అర శాతం వరకు ఎక్కువే వడ్డీలొస్తున్నాయి. అవేంటో.. ఏయే బ్యాంకులు అందిస్తున్నాయో ఒక్కసారి పరిశీలిస్తే..
ఐడీబీఐ బ్యాంక్ ప్రత్యేకంగా తెచ్చిన ఉత్సవ్ ఎఫ్‌డీల్లో పెట్టుబడులు పెట్టేందుకు చివరి తేదీ సెప్టెంబర్ 30. 300, 375, 444, 700 రోజుల కాలవ్యవధితో ఈ స్పెషల్ ఎఫ్డీలను బ్యాంక్ పరిచయం చేసింది. 300 రోజుల ఎఫ్డీపై సాధారణ డిపాజిటర్లకు 7.05 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.55 శాతం వడ్డీరేటు లభిస్తున్నది. ఇక 375 రోజుల ఎఫ్డీపై సాధారణ కస్టమర్లకు 7.15 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.65 శాతం వడ్డీరేటున్నది. 444 రోజుల ఎఫ్డీపై సాధారణ పౌరులకు 7.35 శాతం, వృద్ధులకు 7.85 శాతం వడ్డీరేటు వస్తున్నది. 700 రోజుల ఎఫ్డీకి సాధారణంగానైతే 7.20 శాతం వడ్డీరేటు వర్తిస్తున్నది. సీనియర్ సిటిజన్లకు 7.70 శాతం వడ్డీ ఉన్నది.
ఇండియన్ బ్యాంక్ స్పెషల్ ఎఫ్‌డీల్లో ఇన్వెస్ట్ చేసేందుకున్న ఆఖరు తేదీ సెప్టెంబర్ 30. ఇండ్ సూపర్ 300 రోజుల ఎఫ్డీపై సాధారణ డిపాజిటర్లకు 7.05 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.55 శాతం వడ్డీరేటు వస్తున్నది. ఇక సూపర్ సీనియర్ సిటిజన్లకైతే 7.80 శాతం వడ్డీరేటును బ్యాంక్ ప్రకటించింది. అలాగే 400 రోజుల ఎఫ్డీపై సాధారణంగా 7.25 శాతం వడ్డీరేటున్నది. సీనియర్ సిటిజన్లకు ఇది 7.75 శాతం, సూపర్ సీనియర్లకు 8 శాతం.
222 రోజుల ప్రత్యేక ఎఫ్డీపై పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్.. అత్యధికంగా 6.30 శాతం వడ్డీరేటును ఇస్తున్నది. అలాగే 333 రోజుల ఎఫ్డీపై 7.15 శాతం, 444 రోజుల ఎఫ్డీపై 7.25 శాతం వడ్డీరేట్లున్నాయి. ఈ పరిమితకాల స్పెషల్ ఎఫ్‌డీల్లో ఇన్వెస్ట్మెంట్కున్న గడువు సెప్టెంబర్ 30.
ఈ నెలాఖరుదాకే ఎస్బీఐ అమృత్ కలశ్‌లో పెట్టుబడులు పెట్టవచ్చు. 400 రోజులతోకూడిన ఈ ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్లో వడ్డీరేటు 7.10 శాతం. సీనియర్ సిటిజన్లకైతే 7.60 శాతం. అలాగే ఎస్బీఐ వుయ్‌కేర్ స్కీం గడువును ఈ నెల 30దాకా పొడిగించారు. కొత్త డిపాజిట్లపై, మెచ్యూరింగ్ డిపాజిట్ల రెన్యువల్‌పై మాత్రమే ఈ స్కీం వర్తిస్తుంది. ఇందులో వడ్డీరేటు 7.50 శాతం.