Ayodhya Ram Mandir | ఉడుపి: అయోధ్యలో నిర్మితమవుతున్న రామాలయంలో ప్రతిష్ఠించే శ్రీరాముని విగ్రహం గురించి ఈ నెల 17న బహిర్గతపరుస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ట్రస్టీ, ఉడుపి పెజావర్ మఠానికి చెందిన విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ తెలిపారు. బ్లాక్ స్టోన్‌తో రెండు విగ్రహాలను, గ్రానైట్ స్టోన్‌తో ఒక విగ్రహాన్ని అద్భుతంగా తయారు చేసినట్లు తెలిపారు. వీటిలో దేనిని రామాలయంలో ప్రతిష్ఠించాలో నిర్ణయించేందుకు ట్రస్టు సభ్యులంతా ఓట్లు వేశారని చెప్పారు. ఎంపికైన విగ్రహాన్ని సరయూ నదీ జలాలతో అభిషేకం చేస్తామని, అదే రోజున వెల్లడిస్తామని చెప్పారు.
శ్రీరామ జన్మభూమిలో నిర్మిస్తున్న రామాలయం ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తవుతుందని నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో గురువారం ఆయన మాట్లాడుతూ, గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తయిందని, మొదటి, రెండో అంతస్థులను పూర్తి చేయవలసి ఉందని చెప్పారు. రామాలయం కనీసం 1,000 సంవత్సరాలు ఉండాలని భక్తులు కోరుకుంటారని, అందుకు అనుగుణంగానే తమ బాధ్యతలు కూడా పెరిగాయని చెప్పారు. రానున్న 4-5 నెలల్లో రోజుకు 75 వేల నుంచి లక్ష మంది వరకు భక్తులు శ్రీరాముడిని దర్శించుకునేందుకు వస్తారని అంచనా అని తెలిపారు.
అయోధ్య ఆలయం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. కృత్రిమ మేధస్సు (ఏఐ) సాంకేతిక పరిజ్ఞానంతో ఆలయం వద్ద నిఘా చర్యలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ‘పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా కృత్రిమ మేధతో కూడిన నిఘాను రామ మందిరం వద్ద చేపట్టనున్నాం. ఏఐ నిఘా ఉపయోగంపై కొద్ది రోజుల తర్వాత సమీక్ష జరుపుతాం. ఆ తర్వాత ఇక్కడి భద్రత, నిఘాలో భాగస్వామ్యం చేస్తాం’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని పోలీస్ అధికారి చెప్పారు. మందిరంలో అనుమానాస్పద కదలికలను ఏఐ నిఘా పసిగడుతుందని ఆయన తెలిపారు.