న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) .. పార్లమెంట్లో అడుగుపెట్టే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ముగిసిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన ఆయన.. ఇప్పుడు రాజ్యసభకు ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజ్యసభలో ఎంపీగా ఉన్న సంజీవ్ అరోరాను.. అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీకి దించాలని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తున్నది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్.. పార్లమెంట్‌కు వెళ్తారన్న రూమర్స్ వస్తున్నాయి. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ సీటు నుంచి కేజ్రీవాల్ ఓటమిపాలయ్యారు.
పంజాబ్ నుంచి 2022లో రాజ్యసభ సీటుకు అరోరా ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం 2028 వరకు ఉన్నది. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే, ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అరోరా స్థానం ఖాళీ అయితే, ఆ స్థానంలో కేజ్రీవాల్‌ను రాజ్యసభకు ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయి.