న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధం కారణంగా భారత దేశమే ఎక్కువగా నష్టపోతున్నదని రాజ్యసభలో స్వతంత్ర ఎంపీ కపిల్ సిబల్ ఆవేదన వ్యక్తం. మన ప్రధాని నరేంద్ర మోదీకి ‘దేశమే ప్రథమం’ అన్న దృక్పథం కొరవడిందని, దేశంలో తీవ్ర సంక్షోభం నెలకొన్నా.. కేవలం ఎన్నికల్లో గెలవడం పైనే అయన దృష్టి ఉందని విమర్శించారు. సంక్షోభం వచ్చినప్పుడు మాత్రమే ఆయన టీమ్ ఇండియాను గుర్తు చేసుకుంటారని, పార్లమెంట్లో కానీ, ఇతర సమయాల్లో కానీ దాని గురించి ఆలోచించరని సిబల్ ఆరోపించారు.
శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చమురు సంక్షోభాన్ని పరిశీలిస్తే మన దేశ అవసరాల్లో 88 శాతం ముడి చమురును గల్ఫ్ నుంచే భారత్ దిగుమతి చేసుకుంటుందన్నారు. భారత్ 50 లక్షల బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకుంటుండగా, అందులో 30 లక్షల బ్యారెళ్లు పశ్చిమాసియా నుంచే వస్తున్నాయన్నారు. ప్రస్తుతం అక్కడ బ్యారెల్ 160 డాలర్ల ధర పలుకుతున్నదని, ఇది నిర్దేశిత ధర కన్నా 60 శాతం ఎక్కువని తెలిపారు.
అలాగే యూరియాను కూడా 50 శాతం ఎక్కువ ధరతో కొనుగోలు చేస్తున్నామన్నారు. మన దేశంలో వ్యూహాత్మక చమురు నిల్వలు కేవలం 7, 8 రోజులకే సరిపోవడమేమిటని ఆయన ప్రధాని మోదీని నిలదీశారు. పశ్చిమాసియా సంక్షోభం హఠాత్తుగా ఏర్పడిందేమీ కాదని, ఒక వేళ హొర్ముజ్ను మూసివేస్తే మన దిగుమతుల పరిస్థితి ఏమిటని మీరు ముందస్తుగా ఆలోచించ లేదా? అని ఆయన ప్రశ్నించారు. ఎందుకు ఆలోచించ లేదంటే మీకు దేశ ప్రయోజనాలు కన్నా రాబోయే ఎన్నికల్లో నెగ్గడమే చాలా ముఖ్యమని, అందుకే ప్రజలు బాధలు మీకు పట్టవని విమర్శించారు.