న్యూఢిల్లీ, జూలై 21(నమస్తే తెలంగాణ): రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌కు పార్లమెంట్లో ప్రశంసలు లభించాయి. భావితరాలకు పచ్చదనాన్ని కనుకగా ఇచ్చే దిశగా ఆయన చేస్తున్న కృషిని రాజ్యసభ చైర్మన్ జగ్దీప్దన్ఖడ్ ప్రత్యేకంగా అభినందించారు. ఎంపీ సంతోష్‌కుమార్ పుట్టినరోజు సందర్భంగా రాజ్యసభ చైర్మన్ శుక్రవారం సభలో శుభాకాంక్షలు తెలియజేశారు.
ఎంపీ సంతోష్‌కుమార్ నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాన్ని ప్రస్తావించి, కోట్లాది మొక్కలు నాటే యజ్ఞం చేస్తున్నారని ప్రశంసించారు. ఇప్పటికే గ్రీన్ చాలెంజ్ కార్యక్రమం లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కిందని, ఒకేసారి ఆదిలాబాద్ జిల్లాలో 16,900 మంది ప్రజల భాగస్వామ్యంతో 3,54,900 మొక్కలు నాటారని వివరించారు. సంతోష్‌కుమార్ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. దీంతో సభ్యులంతా కరతాళధ్వనుల ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.