Jagdeep Dhankhar | సెంట్రల్ ఢిల్లీలోని ఓల్డ్ రాజిందర్‌నగర్‌లోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో జరిగిన ఘటనలో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో రాజకీయాలు వేడెక్కాయి. ఈ ఘటనపై రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్ఖర్ ఆందోళన వ్యక్తం చేశారు. కోచింగ్ సెంటర్ల వర్క్ కల్చర్ ప్రస్తుతం గ్యాస్ ఛాంబర్‌గా మారిందన్నారు. వార్తాపత్రికల్లో ప్రకటనలు ఇచ్చేందుకు కోచింగ్ సెంటర్లకు ఇంత పెద్దమొత్తంలో డబ్బు ఎక్కడి నుంచి వస్తోందో దర్యాప్తు చేయాలన్నారు. సోమవారం రాజ్యసభలో ఢిల్లీలో సివిల్స్‌కు సిద్ధమవుతున్న ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటియుగంలో శిక్షణ వాస్తవానికి వ్యాపారంగా సాధనంగా మారిందని తాను భావిస్తున్నానన్నారు.
నేటి యుగంలో కోచింగ్ వ్యాపారం అధిక సంపాదనతో వర్ధిల్లుతోందని.. మనం వార్తాపత్రికలను చదివినప్పుడల్లా, మొదటి పేజీలో కోచింగ్ వ్యాపారానికి సంబంధించిన ప్రకటనలను చూస్తుంటామన్నారు. ప్రకటనలకు వెచ్చించే ప్రతి పైసా విద్యార్థుల నుంచే వస్తోందని.. కోచింగ్ కోసం నిర్మిస్తున్న ప్రతి భవనం విద్యార్థుల సొమ్ముతో నిర్మిస్తున్నారన్నారు. కోచింగ్ వర్క్ కల్చర్ ఇప్పుడు గ్యాస్ ఛాంబర్‌గా మారిపోయిందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అవకాశాలు పొందే రంగం విస్తరిస్తున్న దేశంలో కోచింగ్ సమస్యగా మారుతోందన్నారు. దేశంలోని ఇతర ఉపాధి అవకాశాల గురించి యువతకు తెలియజేయాలని జగదీప్ ధన్ఖర్ రాజ్యసభ సభ్యులను అభ్యర్థించారు. అంతకుముందు, ఢిల్లీలోని కోచింగ్ సెంటర్లో జరిగిన సంఘటనపై చర్చించడానికి సుధాన్షు త్రివేది, స్వాతి మలివాల్‌తో సహా ఇతర రాజ్యసభ సభ్యులు రూల్ నంబర్ 267 కింద నోటీసులు ఇచ్చారు.