Parliament : పార్లమెంట్లో శీతాకాల సమావేశాలు నేటితో (శుక్రవారం) ముగిశాయి. విపక్ష సభ్యుల ఆందోళనల నేపథ్యంలో ఉభయసభలను నిరవధికంగా వాయిదా వేశారు. అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) చేసిన వ్యాఖ్యలపై విపక్ష ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తుండగానే స్పీకర్ (Speaker) ఓం బిర్లా (Om birla) లోక్ సభ (Lok Sabha) ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఆ సమయంలో ప్రధాని మోదీ కూడా సభలో ఉన్నారు.
వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లుపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీలో 12 మంది రాజ్యసభ సభ్యులకు చోటు కల్పించాలని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ ప్రవేశపెట్టిన తీర్మానానికి రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత అమిత్ షా వ్యాఖ్యలపై సభలో విపక్ష ఎంపీలు నిరసనకు దిగడంతో రాజ్యసభను నిరవధికంగా వాయిదా వేశారు. దాంతో పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఇవాళ్టితో ముగిసినట్లయ్యింది.
ఇవాళ ఉదయం ఉభయసభల ప్రారంభానికి ముందు పార్లమెంట్ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం వద్ద .. ఇండియా కూటమి ఎంపీలు నిరసన చేపట్టారు. అంబేద్కర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వారు తప్పుపట్టారు. షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్‌ను అవమానించిన షా రాజీనామా చేయాలన్నారు.