Rajnath Singh : జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం (Pahalgam) లో పర్యటకులపై జరిగిన ఉగ్రదాడి (Terror Attack) పై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. భారత్‌పై కుట్ర పన్నుతున్న వారిని ఊరికే వదలబోమన్నారు. దాడికి భారత్ గట్టి బదులిస్తుందని హెచ్చరించారు. పహల్గాం ఉగ్రదాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఆ ఉగ్రదాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు.
ఉగ్రవాదాన్ని తుదముట్టించాలనేది భారత్ విధానమని, ఉగ్రవాదులను ఎదుర్కొనే విషయంలో దేశ ప్రజలంతా ఐక్యంగా ఉన్నారని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. తమ కుటుంబసభ్యులను కోల్పోయిన బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. దాడికి పాల్పడిన వాళ్లను, కుట్ర పన్నిన వాళ్లను బయటకు లాగి తగిన బుద్ధి చెబుతామన్నారు. పహల్గాం ఘటనపై, శ్రీనగర్‌లో భద్రతా చర్యలపై ఆయన ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠితో చర్చించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు.
బుధవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగనున్న భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలోనూ రాజ్‌నాథ్ పాల్గొననున్నారు. కశ్మీర్లో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన పహల్గాం సమీపంలోని బైసరన్ లోయలో ఉగ్రవాదులు మంగళవారం భీకర దాడికి పాల్పడ్డారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు పర్యటకులను చుట్టుముట్టి అతి సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 28 మంది ప్రాణాలు కోల్పోయారు.