బీజింగ్: చైనాలోని కింగ్డావోలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (SCO) రక్షణ మంత్రుల సమావేశానికి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) హాజరయ్యారు. గల్వాన్ లోయ ఘటన తర్వాత ఆయన చైనాలో పర్యటించడం ఇదే మొదటిసారి. కాగా, భారతదేశ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్న రాజ్‌నాథ్ సింగ్‌కు సమావేశ వేదిక వద్ద చైనా రక్షణ మంత్రి అడ్మిరల్ డాంగ్ జున్ ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఇతర నాయకులతో కలిసి గ్రూప్ ఫొటో దిగారు. ఆ సమయంలో పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కూడా అక్కడే ఉన్నారు.
ఈ సమావేశంలో ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతి-భద్రతలు, ఉగ్రవాదాన్ని నిరోధించే ప్రయత్నాలతో పాటు ఎస్సీఓ సభ్య దేశాల రక్షణ మంత్రిత్వ శాఖల మధ్య సహకారం సహా అనేక అంశాలపై మంత్రులు చర్చించనున్నారు. ఎస్సీఓ సిద్ధాంతాలతో పాటు ఆ దేశాల పట్ల భారత్ తన నిబద్ధతను రాజ్‌నాథ్ సింగ్ మరో సారి చాటిచెప్పనున్నారు. ఉగ్రవాదం, తీవ్రవాద నిర్మూలణలో సభ్యదేశాలు ఒకే విధమైన, సమష్టి ప్రయత్నాలు చేయాలని పిలుపునిచ్చే అవకాశం ఉంది. ఎస్సీఓ దేశాల మధ్య వాణిజ్యం, ఆర్థిక సహకారాన్ని మరింత పెంచుకోవాల్సిన అవసరం స్పష్టం చేయనున్నారు.
ఎస్సీఓను 2001లో ఏర్పాటు చేశారు. ఇందులో భారత్, కజక్‌స్థాన్, చైనా, కిర్గిజ్‌స్థాన్, పాకిస్థాన్, రష్యా, తజకిస్థాన్, ఉబ్జెకిస్థాన్, ఇరాన్, బెలారస్ సభ్యదేశాలుగా ఉన్నాయి. 2017లో భారత్ శాశ్వత సభ్యదేశంగా మారింది. 2023లో అధ్యక్ష బాధ్యతలను నిర్వహించింది. సభ్య దేశాల మధ్య సమానత్వం, అవగాహన, పరస్పర గౌరవం, ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం, దేశాల ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వం వంటి ఈ సిద్ధాంతాల ప్రాతిపదికగా ఎస్సీఓ పనిచేస్తున్నది.