న్యూఢిల్లీ : ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానం అడ్వాన్డ్స్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్(అమ్కా) ఎగ్జిక్యూషన్ మోడల్ తయారీకి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం ఆమోదం తెలియచేశారు. ఇతర సంస్థల భాగస్వామ్యంతో బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ(ఏడీఏ) అమ్కాకు సంబంధించిన ఎగ్జిక్యూషన్ మోడల్ని తయారు చేయనున్నట్లు రక్షణ శాఖ తెలిపింది.
తేజస్ లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్తోపాటు అమ్కా భారతీయ వైమానిక దళం అమ్ములపొదిలోకి రానున్నది. అమ్కా నమూనాను తొలిసారి భారత్ ఏరో ఇండియా-2025లో ప్రపంచానికి చూపించింది. 25 టన్నుల బరువుండే ఈ యుద్ధ విమానాన్ని మానవ సహిత, మానవ రహితంగా పనిచేసేలా డిజైన్ చేయనున్నారు. ఏడీఏ దీని డిజైన్ రూపొందించగా హైదరాబాద్కు చెందిన వేమ్ టెక్నాలజీస్ లిమిటెడ్ విమానం ఫ్యాబ్రికేషన్ పనులు చేసింది.