Rajnath Singh : ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించి వేయడంలో భారత దేశానికి ఉన్న దృఢ సంకల్పానికి ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) నిదర్శనమని రక్షణ శాఖ మంత్రి (Defence Minister) రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) అన్నారు. పాకిస్థాన్ (Pakistan) తో ఉద్రిక్తతల వేళ భారతసైన్యం ధైర్య సాహసాలతోపాటు సంయమనాన్ని ప్రదర్శించిందని, పాకిస్థాన్‌లోని అనేక సైనిక స్థావరాలపై దాడి చేసి పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) కి ధీటైన సమాధానం ఇచ్చిందని చెప్పారు. లక్నోలో వర్చువల్ విధానంలో బ్రహ్మోస్ క్షిపణి తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఆపరేషన్ సిందూర్ కేవలం సైనిక చర్య మాత్రమే కాదని, ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు ఉన్న రాజకీయ, సామాజిక, వ్యూహాత్మక సంకల్పానికి నిదర్శనమని రాజ్‌నాథ్ అన్నారు. పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌లోని, పాకిస్తాన్ ఆక్రమిత జమ్ముకశ్మీర్‌లోని ఏడు ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడానికి మే 7న ఆపరేషన్ సిందూర్ ప్రారంభమైంది. ఆపరేషన్‌లో భాగంగా భారత సేనలు ఉగ్రవాద స్థావరాలపై దాడిచేసి 100 మందికి ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఈ క్రమంలో ఉద్రిక్తతలు మరింత పెరగకుండా శనివారం రెండు దేశాలు పరస్పరం కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నాయి.
అయితే ఈ ఒప్పందం గురించి ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే పాకిస్థాన్ మాట తప్పింది. ఒప్పందాన్ని ఉల్లంఘించి సరిహద్దుల వెంట భారత్‌పై కాల్పులకు తెగబడింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ రక్షణ శాఖ, విదేశాంగ శాఖ మంత్రులు, త్రివిధ దళాల అధిపతులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాక్ ఉల్లంఘనలకు ఎలా సమాధానం చెప్పాలనే అంశంపై చర్చించినట్లు సమాచారం.
కాగా భారత సైన్యం ఎప్పుడూ పాకిస్థాన్ పౌరులను లక్ష్యంగా చేసుకోలేదని, కానీ పాకిస్థాన్ మాత్రం భారతదేశంలోని పౌర ప్రాంతాలు, ప్రార్థనా స్థలాలను లక్ష్యంగా చేసుకుందని విమర్శించారు.