బెంగళూరు, జూన్ 20: కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మరో కుంభకోణం బయటపడింది. రాజీవ్ గాంధీ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా పేదలకు కేటాయించిన ఇండ్ల కేటాయింపులో భారీగా అవినీతి చోటుచేసుకుంది. ఈ పథకంలో పెద్దయెత్తున డబ్బులు చేతులు మారాయి. నిజమైన పేదలకు కాకుండా లక్షల రూపాయలు లంచాలు ఇచ్చిన వారికే ఇళ్లను కేటాయించారు. ఎమ్మెల్యేల సిఫార్సులను సైతం బేఖాతరు చేసి అధికారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. స్వయాన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ ఈ మేరకు మాట్లాడిన ఒక ఆడియో ఇప్పుడు వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం బయటపడింది. లంచాలు ఇచ్చి అక్రమంగా ఇళ్లు పొందిన వారి జాబితా కనుక బయటకు వస్తే కర్ణాటక ప్రభుత్వం కదిలిపోతుందని పాటిల్ ఆ ఆడియోలో హెచ్చరించారు.
హౌసింగ్ శాఖ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ వ్యక్తిగత సహాయకుడు సర్ఫజ్ఖాన్తో అలంద్ ఎమ్మెల్యే, కర్ణాటక రాష్ట్ర పాలసీ, ప్రణాళికా కమిషన్ డిప్యూటీ చైర్మన్ కూడా అయిన పాటిల్ మాట్లాడిన ఆడియో లీక్ అయింది. ఈ ఆడియోలో తాను, మిగిలిన ప్రజాప్రతినిధులు సిఫార్సు చేస్తూ ఇచ్చిన లేఖలను సైతం బేఖాతరు చేస్తూ లంచాలు ఇచ్చిన వారికి మాత్రమే ఈ పథకం కింద ఇండ్లను కేటాయించారని పాటిల్ ఆరోపించారు. తాను చేసిన సిఫార్సులను కూడా వారు పక్కన పడేసి లంచాలు ఇచ్చిన గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్లు సిఫార్సు చేసిన వారికి ఇండ్లను కేటాయించారని, ఇదేమన్నా వ్యాపారమా? అని పాటిల్ ఆగ్రహంతో ప్రశ్నించారు.
తాను చేసిన సిఫార్సుల కన్నా డబ్బు చెల్లించిన వారికే హౌసింగ్ కార్పొరేషన్ ఎందుకు ప్రాధాన్యం ఇచ్చిందని ఆయన నిలదీశారు. ఇలా జరిగితే ఇక తన గౌరవం ఏముంటుందని ఆయన ఆగ్రహంతో ప్రశ్నించారు. అలా లంచాలు తీసుకున్న వారి జాబితా ఇస్తే వారిని జైలుకు పంపుతానని ఖాన్ పేర్కొన్నారు. ఇళ్లు పొందిన వారి జాబితా కనుక బయటకు వస్తే కర్ణాటక ప్రభుత్వం షేక్ అవుతుందని పాటిల్ హెచ్చరించారు. ఆయన మాట్లాడిన ఈ ఆడియో ఇప్పుడు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నది. అయితే దీనిని తక్కువ చేయడానికి కాంగ్రెస్ నేతలు కిందామీదా పడుతున్నారు.
దీనిపై బీజేపీ నేత, మాజీ సీఎం యెడియూరప్ప స్పందిస్తూ ‘కాంగ్రెస్ ఎమ్మెల్యే పాటిల్ చెప్పింది వందశాతం నిజం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో లంచం లేకుండా ఏ పనీ జరగదు. ఈ విషయాన్ని ఆ పార్టీ ఎమ్మెల్యేయే స్వయంగా చెప్పారు. ఈ విషయాన్ని ప్రభుత్వం అంగీకరించి తన తప్పును సరిదిద్దుకోవాలి’ అని అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఇళ్ల కేటాయింపుకే కాదు, దేనికైనా లంచం ఇవ్వాల్సిందేనన్న విషయాన్ని స్వయంగా ఎమ్మెల్యే పాటిలే ఒప్పుకున్నారని, నూరు శాతం అవినీతితో నిండిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది సిద్ధరామయ్య ప్రభుత్వమేనని బీజేపీ హుబ్లీ ఎమ్మెల్యే మహేశ్ విమర్శించారు.