Volleyball Player : మైనర్ బాలిక (Minor Girl) ను ప్రేమించిన నడిపినందుకు వాలీబాల్ ప్లేయర్ (Volleyball Player) దారుణహత్యకు గురయ్యాడు. ఈ షాకింగ్ ఘటన హర్యానా (Haryana) లోని ఫరీదాబాద్ (Faridabad) లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ (Rajasthan) కు చెందిన యువ వాలీబాల్ క్రీడాకారుడు 21 ఏళ్ల మోను (21) ఫరీదాబాద్‌కు చెందిన ఒక మైనర్ బాలికతో ప్రేమలో ఉన్నాడు. ఈ క్రమంలో గత ఏప్రిల్‌లో బాలిక కిడ్నాప్ ఆరోపణల నేపథ్యంలో మోనుపై కేసు కూడా నమోదైంది.
మే 17న పోలీసు విచారణ కోసం స్టేషన్‌కు బయలుదేరిన మోనును మార్గమధ్యంలోనే బాలిక కుటుంబసభ్యులు కిడ్నాప్ చేసి ఒక ఇంట్లో బంధించారు. మూడు రోజులపాటు అన్నం పెట్టకుండా కాళ్లు చేతులు కట్టేసి ఇనుపరాడ్లతో తీవ్రంగా చిత్రహింసలకు గురిచేసి, మే 20న రోడ్డుపై పడేసి వెళ్లారు. తీవ్ర గాయాలపాలైన మోనును ఆస్పత్రిలో చేర్పించగా పరిస్థితి విషమించి శుక్రవారం రాత్రి ఆయన మరణించాడు. దాంతో కన్న కొడుకును కోల్పోయిన బాధితుడి కుటుంబసభ్యుల ఆక్రందనలు మిన్నంటాయి.
ఈ ఘోర ఘటనపై మృతుడి కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫరీదాబాద్ పోలీసులు హత్య, కిడ్నాప్ కేసులు నమోదు చేశారు. ఈ పరువు హత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక క్రీడా సంఘాలు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు ప్రధాన అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసు ప్రతినిధి వెల్లడించారు.