Vote for Note | జైపూర్, నవంబర్ 22: రాజస్థాన్లో అధికార కాంగ్రెస్ పార్టీ మంత్రి ఒకరు ఓట్లకు నోట్ల పంపిణీ వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల సందర్భంగా పంచిన డబ్బును ఒక మహిళ.. మంత్రి శాంతి ధర్వాల్కు తిరిగి ఇచ్చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయింది. డబ్బులు పంచి ఎన్నికల్లో గెలవాలనుకుంటున్న మంత్రికి ఆ మహిళ భలే బుద్ధి చెప్పింది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
సదరు మహిళ మాట్లాడుతూ.. భయ్యా వచ్చి 25 వేలు ఇచ్చారని మంత్రి ధర్వాల్తో పేర్కొంది. మంత్రితో మాట్లాడకుండా ఆమెను అడ్డుకునేందుకు మంత్రి అనుచరుడొకరు ప్రయత్నించారు. ఈ వీడియో వైరల్ కావడంతో, దీనిపై ప్రధాని మోదీ సైతం ఎన్నికల ప్రచార సభలో విమర్శలు గుప్పించారు. ఆ అవినీతి నేత చరిత్రను ఇప్పుడు దేశం మొత్తం చూస్తున్నదని వ్యాఖ్యానించారు. డబ్బుతో ఓటును కొనాలనుకుంటున్న మంత్రికి ఆ మహిళ బాగా బుద్ధి చెప్పిందని ఆమెను అభినందించారు.