గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 30, 2020 , 03:20:44

14న రాజస్థాన్‌ అసెంబ్లీ

14న రాజస్థాన్‌ అసెంబ్లీ

జైపూర్‌: రాజస్థాన్‌ రాజకీయాల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. అసెంబ్లీని సమావేశపర్చాలంటూ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా ఎట్టకేలకు ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఆగస్టు 14న అసెంబ్లీని సమావేశపరుచనున్నట్టు రాజ్‌భవన్‌ వర్గాలు బుధవారం తెలిపాయి. అంతకుముందు, వచ్చే నెల 14న శాసనసభను సమావేశపర్చాలని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర కేబినెట్‌ గవర్నర్‌కు నాలుగోసారి ప్రతిపాదనను పంపింది. అసెంబ్లీ సమావేశానికి ప్రభుత్వం సరైన కారణం చెప్పని పక్షంలో 21 రోజుల ముందుగా నోటీసు కోరవచ్చన్న గవర్నర్‌ సూచనల మేరకే తాజా ప్రతిపాదనను సిద్ధం చేసినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీంతో మిశ్రా అసెంబ్లీని సమావేశపరిచేందుకు అంగీకరించారు. మరోవైపు, రాజస్థాన్‌ మాజీ డిప్యూటీ సీఎం సచిల్‌ పైలట్‌తోపాటు 19 మంది కాంగ్రెస్‌ తిరుగుబాటు ఎమ్మెల్యేలకు జారీ చేసిన అనర్హత నోటీసులపై యథాతథస్థితిని కొనసాగిస్తూ జూలై 24న రాష్ట్ర హైకోర్టు జారీచేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ అసెంబ్లీ స్పీకర్‌ సీపీ జోషి బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఇదిలాఉండగా అధికార కాంగ్రెస్‌పార్టీలో తమ ఆరుగురు ఎమ్మెల్యేల విలీనాన్ని సవాల్‌ చేస్తూ బీఎస్పీ రాజస్థాన్‌ హైకోర్టును ఆశ్రయించింది. రాజస్థాన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా గోవింద్‌ సింగ్‌ డోటాసరా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. 


logo