సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Feb 27, 2020 , 02:52:34

పెండ్లింట విషాదం

పెండ్లింట విషాదం
  • 24 మంది దుర్మరణం
  • వంతెనపై నుంచి నదిలో పడిన బస్సు
  • రాజస్థాన్‌లోని కోటాలో దుర్ఘటన

బుండీ: పెండ్లి బృందంతో వెళ్తున్న ప్రైవేటు బస్సు అదుపుతప్పి వంతెనపై నుంచి నదిలో పడింది. రాజస్థాన్‌లోని బుండీ జిల్లాలో బుధవారం ఉదయం 9.30 గంటలకు ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 24 మంది దుర్మరణం చెందగా ఐదుగురు గాయపడ్డారు. మరణించిన వారిలో 11 మంది మహిళలు, పది మంది పురుషులు, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు జిల్లా కలెక్టర్‌ నెహ్రా తెలిపారు. పెండ్లి వేడుక కోసం 29 మందితో కూడిన ప్రైవేటు బస్సు కోటా నుంచి సవాయ్‌ మాధోపూర్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారు. లేఖరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పాప్డి గ్రామ సమీపంలోని వంతెన వద్దకు బస్సు చేరిన సమయంలో డ్రైవర్‌ శ్యామ్‌సింగ్‌ నియంత్రణ కోల్పోయాడు. వంతెనకు ఎలాంటి రక్షణ గోడలు లేకపోవడంతో సుమారు 20-25 అడుగుల ఎత్తు నుంచి కిందనున్న మేజ్‌ నదిలోకి బస్సు దూసుకెళ్లింది. పెద్ద శబ్దం రావడంతో ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. తాళ్ల సాయంతో కొందరిని బస్సు నుంచి బయటకు వెలికి తీశారు. డ్రైవర్‌తో సహా 13 మంది ఘటనా స్థలంలోనే చనిపోయారు. క్షతగాత్రులను దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో 11 మంది మరణించారు.  సీఎం అశోక్‌ గెహ్లాట్‌ బస్సు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.


logo