ముంబై, జూలై 27: ఠాక్రే సోదరులు మరోసారి చేతులు కలిపారు. గడచిన 13 ఏళ్లలో మొట్టమొదటిసారి మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే ముంబైలోని ఠాక్రేల నివాస భవనం మాతోశ్రీని ఆదివారం సందర్శించారు. శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రేకి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయడానికి రాజ్ ఠాక్రే స్వయంగా మాతోశ్రీని సందర్శించడం విశేషం. 2012లో శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ ఠాక్రే మరణించిన సమయంలో రాజ్ మాతోశ్రీకి విచ్చేశారు. మాతోశ్రీ లోపల బాలాసాహెబ్ చిత్రపటం ముందు ఉద్ధవ్, రాజ్ నిలబడి ఫొటో తీసుకున్నారు. తన సోదరుడు ఉద్ధవ్కి రాజ్ పుష్పగుచ్ఛం అందచేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు.
దశాబ్దం క్రితం విడిపోయిన ఇద్దరు సోదరులు ఈ నెల మొదట్లో మొట్టమొదటిసారి ఒకే వేదికను పంచుకున్నారు. మరాఠీ అస్తిత్వం, మరాఠీలపై హిందీ భాష విధింపును వ్యతిరేకిస్తూ వారిద్దరూ ఒకే వేదికపై నుంచి ప్రసంగించారు. వొర్లిలో జరిగిన విజయోత్సవ ర్యాలీలో కూడా వారిద్దరూ పాల్గొన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికలలో తమ రెండు పార్టీలు కలసి పోటీచేస్తాయని ఆ సందర్భంగా ఉద్ధవ్ సూచనప్రాయంగా వెల్లడించారు. 2005లో శివసేన నుంచి తప్పుకున్న రాజ్ తన సొంత పార్టీ ఎంఎన్ఎస్ స్థాపించారు. అప్పటి నుంచి ఆ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేస్తున్నాయి.